PAWAN KALYAN GRAMA SABHA:గ్రామాభివృద్ధికి ఏం చేయాలన్న అంశంలో 'గ్రామసభ' చాలా ముఖ్యమని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. అన్నమయ్య జిల్లా మైసూరువారిపల్లెలో నిర్వహించిన గ్రామ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు.
కాగా 'స్వర్ణ గ్రామపంచాయతీ' పేరుతో నేటి నుంచి ప్రత్యేక కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో 'గ్రామసభలు' నిర్వహించున్నారు. మైసూరువారిపల్లెలో నిర్వహించిన గ్రామసభలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకంపై రాష్ట్రస్థాయి గ్రామసభ నిర్వహించారు. గ్రామసభకు పవన్‌తో పాటు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కలెక్టర్ శ్రీధర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు.
గ్రామాలు పచ్చగా ఉంటేనే: అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయని, గ్రామాలు పచ్చగా ఉంటే మనమంతా హాయిగా ఉంటామని పవన్ కల్యాణ్ అన్నారు. పార్టీ కోసం పనిచేసేందుకు ముందుకొచ్చే వారిని తాను వదలుకోనని, మనుషులను కలుపుకొనే వ్యక్తినని, విడగొట్టేవాణ్ని కాదని తెలిపారు. గ్రామాభివృద్ధికి ఏం చేయాలన్న అంశంలో గ్రామసభ చాలా ముఖ్యమన్నారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అన్ని చర్యలు చేపడుతున్నామన్న పవన్, 13 వేల 326 పంచాయతీలు బలపడితే రాష్ట్ర అప్పులన్నీ తీర్చగలమని అభిప్రాయపడ్డారు.
ఒకరి అనుభవం, ఇంకొకరి సంకల్పం, మరొకరి విజన్:గత ప్రభుత్వంలో రోడ్లపై రావడానికి కూడా భయపడేవారని, అనుభవం ఉన్న నాయకులు కూడా భయపడే పరిస్థితి తెచ్చారని పవన్ మండిపడ్డారు. భర్త ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని మైసూరువారిపల్లె సర్పంచ్‌గా సంయుక్త నిలబడి గెలిచారని ప్రశంసించారు. కారుమంచి సంయుక్త పట్టుదల చూసి నాకు చాలా ఆనందం కలిగిందన్న పవన్, రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోసం ఆలోచించామన్నారు. ఉన్న నిధులను కూడా దారిమళ్లించిన పరిస్థితి గతంలో చూశామని, గ్రామాలకు ఏం కావాలని చిత్తశుద్ధితో ఆలోచిస్తేనే మంచి జరుగుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, స్వర్ణ గ్రామాలు చేసుకోవాలనేదే తమ లక్ష్యమన్న పవన్, ఒకరి అనుభవం, ఇంకొకరి సంకల్పం, మరొకరి విజన్‌తో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వ బంగారు సంకల్పం - నేడు రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు - Grama Sabhalu in AP