తెలంగాణ

telangana

2019లో పసుపు బోర్డు, ఇప్పుడు గల్ఫ్ బోర్డు - ఇందూరు రాజకీయాల్లో తెరపైకి మరో కొత్త అంశం - gulf board in nizamabad politics

By ETV Bharat Telangana Team

Published : Apr 18, 2024, 8:08 PM IST

Nizamabad Politics around Gulf Board : నిజామాబాద్​ లోక్​సభ రాజకీయం గత ఎన్నికల్లో పసుపు బోర్డు చుట్టూ తిరిగితే, ఇప్పుడు గల్ఫ్‌ బోర్డు చుట్టూ తిరుగుతోంది. పార్లమెంట్‌ పరిధిలో గల్ఫ్‌ కార్మికులు ఎక్కువ ఉండటంతో వారి కోసం అన్ని పార్టీలు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి. గల్ఫ్‌ బోర్డు ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రకటనపై రాజకీయ వేడి రాజుకుంది. ప్రతిపక్ష బీజేపీ, బీఆర్​ఎస్​లు హస్తం పార్టీ ప్రకటనపై మండిపడుతున్నాయి. ఎన్నికల వేళ గల్ఫ్‌ కార్మికులను మభ్య పెట్టేందుకు ప్రకటన చేశాయని విమర్శిస్తున్నాయి.

Nizamabad Politics around Gulf Board Announcement
Nizamabad Politics around Gulf Board

2019లో పసుపు బోర్డు, ఇప్పుడు గల్ఫ్ బోర్డు - ఇందూరు రాజకీయాల్లో తెరపైకి మరో కొత్త అంశం

Nizamabad Politics around Gulf Board Announcement : నిజామాబాద్‌ లోక్‌ సభ రాజకీయాల్లో మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. 2014 ఎన్నికల్లో చక్కెర కర్మాగారం తెరిపించడం, 2019లో పసుపు బోర్డు ఏర్పాటు అంశం కీలక పాత్ర పోషించింది. పసుపు బోర్డు హామీ ఇచ్చిన బీజేపీ అభ్యర్థి అర్వింద్‌ను పసుపు రైతులు భారీ మెజార్టీతో గెలిపించారు. ఇప్పుడుగల్ఫ్‌ బోర్డు అంశం తెర మీదకు వచ్చింది. ఆ లోక్‌సభ నియోజకవర్గంలో కుల, సామాజిక ఓటర్ల కన్నా, గల్ఫ్ దేశాల్లో ఉన్న కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఓట్లు కీలకంగా మారాయి. గల్ఫ్‌ కార్మికుల కోసం బోర్డు ఏర్పాటు చేస్తామని ఇటీవలే హైదరాబాద్​లో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.

Parliament Election 2024 : ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి చేసిన ఈ ప్రకటన రాజకీయ వివాదానికి తెర లేపింది. నిజామాబాద్ లోక్‌సభ పరిధిలో అధికంగా ఉన్న గల్ఫ్‌ కార్మికులు, వారి కుటుంబసభ్యుల ఓట్లను రాబట్టుకునేందుకు బోర్డు తెరపైకి వచ్చిందన్న చర్చ సాగుతోంది. కాంగ్రెస్‌ ప్రకటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఇన్నాళ్లూ గల్ఫ్‌ కార్మికుల ఊసెత్తని హస్తం పార్టీ, ఎన్నికల కోసమే గల్ఫ్‌ బోర్డు అంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శిస‌్తున్నాయి. ప్రవాస భారతీయుల కోసం బీజేపీ విశేషంగా కృషి చేసిందని, గల్ఫ్‌లో చిక్కుకున్న వారిని అనేకసార్లు తిరిగి క్షేమంగా ఇళ్లకు చేర్చిందని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి అర్వింద్‌ పేర్కొన్నారు. ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రజల కోసం నరేంద్ర మోదీ పాటుపడుతున్నారని చెప్పుకొచ్చారు.

Gulf Agents Frauds Telangana : గల్ఫ్​ ఏజెంట్ల మోసాలు.. బాధితుల అష్టకష్టాలు

ఏళ్లకేళ్లు అధికారంలో ఉన్నా ఏనాడూ పట్టించుకోని కాంగ్రెస్‌, పార్లమెంట్‌ ఎన్నికల వేళ గల్ఫ్‌ కార్మికులను మభ్య పెట్టేందుకు బోర్డు అంటూ కొత్త నాటకానికి తెరలేపింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం గల్ఫ్‌లో చిక్కుకున్న అనేక మందికి అండగా నిలిచింది. పరీక్షలొచ్చినప్పుడే పుస్తకాలు తీసినట్టుగా, ఎన్నికలప్పుడే కాంగ్రెస్​కు ప్రజలు గుర్తొస్తారు. ఎన్నికలతో సంబంధం లేకుండా బీజేపీ నిరంతరం ప్రజల కోసం పని చేస్తోంది. - ధర్మపురి అర్వింద్‌, నిజామాబాద్​ బీజేపీ ఎంపీ అభ్యర్థి

గల్ఫ్​ వెళ్లి చేతులు కాల్చుకున్నాడు.. ఒక్క ఐడియాతో జీవితాన్నే మార్చేసుకున్నాడు..!

గల్ఫ్‌ కార్మికుల ఓట్ల కోసమే కాంగ్రెస్‌ ప్రకటన చేసిందని బీఆర్​ఎస్​ లోక్‌సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ విమర్శించారు. బీఆర్​ఎస్​ తరపున ఎన్నారై సెల్‌ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. ఇప్పటికే గ్యారంటీల పేరిట ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌, గల్ఫ్‌ బోర్డు అంటూ కొత్త పాట పాడుతోందని ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక అంశం చుట్టూ నిజామాబాద్‌ లోక్‌సభ రాజకీయం తిరుగుతోందని, ఈసారి గల్ఫ్‌ బోర్డు అంశం ఏ పార్టీకి కలిసి వస్తుందోనన్న చర్చ జిల్లాలో సాగుతోంది.

గల్ఫ్ బాధితులకు కేటీఆర్ పరామర్శ​ - రాష్ట్రంలోనే ఉపాధి అందిపుచ్చుకోవాలని సూచన

ABOUT THE AUTHOR

...view details