Nara Lokesh Face to Face with Youth at Yuvagalam Sabha in Nellore:కూటమి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను తెరిపించి యువతకు శిక్షణ ఇస్తామని మంగళగిరి తెలుగుదేశం అభ్యర్థి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. నెల్లూరులో యువగళం సభలో పాల్గొన్న లోకేశ్ యువతతో ముఖాముఖి నిర్వహించారు. జగన్ అనాలోచిత విధానాలతో పరిశ్రమలను తరిమేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో యువత సంక్షేమానికి పెద్దపీట వేశామని 20 లక్షల ఉద్యోగాలిస్తామని భరోసా ఇచ్చారు. స్టార్ట్‌అప్స్‌ను ప్రోత్సహిస్తామన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ సమక్షంలో టీడీపీలో 20 కుటుంబాలు చేరాయి. వైసీపీ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గడపకు తీసుకొస్తాం: కూటమి ప్రభుత్వం రాగానే ఆగిపోయిన అమరావతి పనులను పూర్తిచేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గడపకు చేర్చాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని వారి గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామని అన్నారు. వాలంటీర్లను ప్రజాప్రతినిధులతో అనుసంధానిస్తామని తెలిపారు. పీజీ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ అమలు చేస్తామని లోకేశ్ అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం బోర్డు ఉండేదని ఆ బోర్డులోని నిధులను వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని లోకేశ్ ఆరోపించారు. బోర్డులో నిధులు లేక కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల బోర్డును అధికారంలోకి రాగానే తిరిగి పునరుద్ధరిస్తాని తెలిపారు. ఏటా జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాల భర్తీ చేస్తామని లోకేశ్ తెలిపారు.