Nama Nageswara Rao Nomination in Khammam MP Seat : రాష్ట్రంలో ఖమ్మం సీటు వ్యవహారం మండు వేసవిలో హీట్ ఎక్కిస్తోంది. అభ్యర్థులుగా ఎవరు నామినేషన్ వేస్తారా అనే సందిగ్ధంలో ప్రజలు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఎంచుకోవడంలో తర్జనభర్జన పడుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామ నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా తాండ్ర వినోద్‌రావు తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. అయితే అధికారి పార్టీ అభ్యర్థి ఇప్పటికీ అభ్యర్థిని ప్రకటించలేదు.
Khamma MP Seat Heat: రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల హడావిడితో నాయకులు జోరుగా ముందుకు సాగుతున్నారు. అయితే ఖమ్మంలో పరిస్థితి మాత్రం వేరే లెవెల్. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గడువుకు ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. అయిన కాంగ్రెస్‌లో ఎంపీ అభ్యర్థి ఎవరో అనే చిక్కుముడి వీడలేదు. ఈ విషయంలో నిర్ణయం తీసుకునేందుకు జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వరకు వెళ్లింది. ఇద్దరు మంత్రులు సీటు తమకు అంటూ తమకు అని పట్టుపడుతున్నారు. మొదటిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడికి సీటు కావాలని ఆశించిన పోటీని చూసి ఆశలు వదులుకున్నారు. ప్రస్తుతం భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల మధ్యే ప్రధానంగా ఖమ్మం సీటు పంచాయతీ నడుస్తోంది.
కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో: ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పోటీ చేస్తారని ప్రచారం కూడా జరిగింది. రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆమె రాజ్యసభలోకి వెళ్లేందుకు సుముఖత చూపారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పేర్లు బరిలో వినిపించాయి. అనంతరం వారి స్థానాలు ఖరారు కావడంతో స్థానిక నేతల్లో ఆశలు రేగాయి. అప్పటినుంచి ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న పీఠముడి వీడలేదు.