MLC Jeevan Reddy On BRS : బీఆర్ఎస్ పార్టీపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాలపై అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సౌర, పవన విద్యుదుత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వలేదన్న జీవన్‌రెడ్డి రూ.3కు దొరికే విద్యుత్‌ను వద్దని చెప్పి రూ.6కు ఎవరైనా కొంటారా? అని ప్రశ్నించారు. చర్చను పక్కదారి పట్టించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. కేసీఆర్ నిర్ణయంతో విద్యుత్ శాఖపై 40,000 కోట్ల ఆర్థిక భారం పడిందన్నారు. గాంధీభవన్‌లో ఆయన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
MLC Jeevan Reddy Fires On KCR : కమీషన్ల కోసం కక్కుర్తి పడి ఎక్కువ పైసలు పెట్టి విద్యుత్ కొనుగోలు చేశారన్నారు. కేసీఆర్ నిర్ణయంతో విద్యుత్ శాఖ పై రూ.40,000 కోట్ల ఆర్థిక భారం పడిందన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ భారం అవుతుందని అప్పుడే చెప్పామని, అప్పటి ప్రభుత్వం వినలేదని మండిపడ్డారు. బొగ్గు ఉత్పత్తి అయ్యే చోట పవర్ ప్లాంట్లు పెట్టాలి కానీ దామరచర్లలో ఎందుకు పవర్ ప్లాంట్ పెట్టారని ప్రశ్నించారు.
విద్యుత్ శాఖలో జరిగిన అవినీతి కేసీఆర్ మెడకు చుట్టుకుంటుందని, అందుకే హరీశ్ రావు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు అని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల్లోనెట్టి ఇప్పుడు పనులు చేయండి చెయ్యండి అంటే ఎట్లా? అని ప్రశ్నించారు. హామీలు అమలు చేస్తాము 5 ఏళ్ల సమయం ఉందని స్పష్టం చేశారు.
యువత భవిష్యత్‌తో బీఆర్ఎస్ ఆటలాడింది :బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లుగా యువత భవిష్యత్తుతో ఆటలు ఆడిందన్న జీవన్‌రెడ్డి తమ పార్టీ వచ్చాక జాబ్ క్యాలెండర్ ఇస్తున్నామన్నారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నాం చేస్తున్నామని తెలిపారు. ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చాక దాని ప్రకారమే భర్తీ చేపట్టాలన్నారు. నోటిఫికేషన్ ఇచ్చాక మార్పులు చేసేందుకు అవకాశం లేదన్నారు. నీట్ అవకతవకలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ అవకతవకలపై పోరాటం చేస్తామని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు.