Ministers Fires on Jagan : శాసనమండలి సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రులు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు హయాంలో 2014-19 మధ్య పోలవరం పనులు 72 శాతం జరిగాయని జలవనురుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. జగన్ పాలనలో 2 శాతం పురోగతి సాధించినట్లు చూపిస్తున్నారని, వాస్తవానికి 20 నుంచి 30 శాతం పనులు తిరోగమించినట్లు నిమ్మల విమర్శించారు.
పోలవరాన్ని జగన్ ఏనాడు పట్టించుకోలేదు : మంత్రి నిమ్మల (ETV Bharat) పోలవరాన్ని జగన్ ఏనాడు పట్టించుకోలేదని జలవనురుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పోలవరం పనులు వెనక్కి పంపిన ఘనత ఆయనదేనని వ్యాఖ్యానించారు. ఏజెన్సీలు మార్చొద్దని చెప్పినా గత సీఎం పట్టించుకోలేదని విమర్శించారు. ఏజెన్సీలు, అధికారులు లేకపోతే పనులు ఎలా సాగుతాయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసే బాధ్యత చూసుకుంటామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం సంతోషకరమని చెప్పారు. చంద్రబాబు చేసిన కృషితోనే కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధుల కేటాయింపులు జరిగాయని నిమ్మల వెల్లడించారు.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యాశాఖలో మంచి విధానాలు :మండలిలో సభ్యుల ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ సమాధానాలు ఇచ్చారు. తల్లికి వందనం పథకానికి విధివిధానాలు రూపొందిస్తున్నామని లోకేశ్ తెలిపారు. ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ బడుల విద్యార్థులందరికీ ఇది వర్తించనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ వైఫల్యంతో 72,000ల మంది విద్యార్థులు తగ్గారని వివరించారు. ఇతర రాష్ట్రాల్లోని మంచి విధానాలు అధ్యయనం చేస్తామని, వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యాశాఖలో మంచి విధానాలు అమలు చేయనున్నట్లు లోకేశ్ వెల్లడించారు.
టోఫెల్ విధానాన్ని సమీక్షిస్తున్నాం:అవసరం లేకున్నా గత ప్రభుత్వం 3వ తరగతి నుంచే టోఫెల్ విధానం తీసుకొచ్చిందని లోకేశ్ తెలిపారు. కేవలం కొన్ని సంస్థల ప్రయోజనం కోసం టోఫెల్ విధానాన్ని వైఎస్సార్సీపీ తెచ్చిందని ఆరోపించారు. ఆనాటి సర్కార్ తెచ్చిన ఈ విధానాన్ని సమీక్షిస్తున్నామని చెప్పారు. అందరితో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలుకు తాము వ్యతిరేకం కాదని, సరైన టీచర్లు లేకున్నా, ఉన్నవారికి శిక్షణ ఇవ్వకుండానే ఆంగ్ల మాధ్యమం అమలుకు వ్యతిరేకమని వివరించారు. గతంలో తెచ్చిన వాటిలో మంచి విధానాలు ఉంటే వాటిని కొనసాగిస్తామని లోకేశ్ వ్యాఖ్యానించారు.
శవ రాజకీయాల కోసమే దిల్లీకి జగన్: జీవీ ఆంజనేయులు - GV Anjaneyulu Fires on Jagan