YSRCP Leaders Iron Scam in Krishna District: వైఎస్సార్సీపీ హయాంలో జగనన్న కాలనీల పేరుతో చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని వెలగలేరులో జగనన్న కాలనీ లబ్ధిదారులకు అందించాల్సిన ఇనుమును వైఎస్సార్సీపీ నేతలు, అధికారులు, గుత్తేదారులు కలిసి దోచేశారు. జీపీఎస్ ట్యాగింగ్‌ను తొలగించి మరీ, రూ.1.95 కోట్ల విలువైన 271.152 మెట్రిక్ టన్నుల ఇనుమును పక్కదారి పట్టించారు. గొల్లపూడిలో గోడౌన్ కేంద్రంగా 2024 జూన్ వరకు ఇద్దరు ఏఈల నేతృత్వంలో ఈ దోపిడీ సాగింది. గోడౌన్‌కి వచ్చిన సరకును అక్కడ దించకుండా, నేరుగా గుత్తేదారుల వాహనాల్లో ఎక్కించి తరలించేశారు. టన్ను రూ.70 వేలు ఉంటే కేవలం 30 నుంచి 40 వేల రూపాయలకు మాత్రమే అమ్మేశారు.
గొల్లపూడిలో గృహనిర్మాణ సంస్థ గోడౌన్‌కు 2023 జులై వరకు ఏఈ ఎం. శ్రీధర్‌కుమార్ ఇన్‌ఛార్జిగా ఉన్నారు. ఈ సమయంలో వైఎస్సార్సీపీకి అనుకూల గుత్తేదారులతో కలిసి భారీ అక్రమాలకు పాల్పడ్డారు. స్టాక్ రిజిస్టర్లు, డాక్యుమెంట్లు, లబ్ధిదారులకు పంపిణీ సహా ఏ వివరాలు కూడా నమోదు చేయలేదు. వచ్చిన సరకు వచ్చినట్టే కాంట్రాక్టుల వాహనాల్లో పంపేశారు. కనీసం స్టాక్ వివరాలను కూడా నమోదు చేయలేదు. శ్రీధర్‌కుమార్ బదిలీ అయినా, తర్వాత వచ్చిన అధికారికి బాధ్యతలు అప్పగించకుండా రెండు నెలలు పత్తా లేకుండా పోయారు.
అతడిని మించిన ఘనుడు: ఉన్నతాధికారుల ఆదేశాలతో పశ్చిమ డీఈ ఆధ్వర్యంలో విచారణ జరగగా గోడౌన్లో అక్రమాలు తేలాయి. దీంతో శ్రీధర్‌కుమార్‌ను కార్పొరేషన్‌కు సరెండర్ చేయగా, తర్వాత మరో ఏఈ బి. శ్రీనివాసరావును గోడౌన్‌కి ఇన్‌ఛార్జిగా నియమించారు. అయితే ఆయన ఉన్న సమయంలో అక్రమాలు మరింతగా జరిగాయి. స్టాక్ రిజిస్టర్లు లేకుండానే గుత్తేదారులకు ఇనుమును అమ్మేశారు.
గోడౌన్‌కి వచ్చిన ఇనుమును భద్రపరచడం వరకే గృహనిర్మాణ ఏఈ పని. లబ్ధిదారుకు ఇవ్వాలంటే ముందుగా వారి ఇంటికి వార్డు ఎమినిటీస్ సెక్రటరీలు వెళ్లి పరిశీలించి, జియో ట్యాగింగ్ చేయాలి. తరువాతే ఇవ్వాలి. కానీ గొల్లపూడిలో ఇలా జరగలేదు. కంపెనీ నుంచి ఇనుము గోడౌన్‌కు వచ్చే వరకూ ఆన్‌లో ఉన్న జియో ట్యాగింగ్‌ను ఆపేసి, తరువాత నచ్చినచోటకు తరలించి అమ్ముకున్నారు.
ఒకరిపై వేటు - పలువురికి నోటీసులు: వార్డు ఎమినిటీస్ సెక్రటరీలు ఫిర్యాదు చేయడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. దీనిపై 2024 జూన్ వరకు పనిచేసిన ఏఈ, డీఈ, పీడీ, ఈఈ, వార్డు ఎమినిటీస్ సెక్రటరీలు, గుత్తేదారులను విచారించగా అక్రమాలు తేలాయి. అక్రమానికి బాధ్యులైన ఏఈ బి. శ్రీనివాసరావును సస్పెండ్ చేశారు. అదే విధంగా శ్రీధర్‌కుమార్ పదవీ విరమణ చేయడంతో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీదేవి సైతం పదవీ విరమణ చేశారు. రాష్ట్ర కార్యాలయంలో పని చేస్తున్న మరో పీడీకి సైతం నోటీసులు ఇచ్చారు. ఐదుగురు డీఈలు, ఇద్దరు ఈఈలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.