Minister Uttam Kumar on Farmer Loan Waiver Issues :రాష్ట్రంలో జరిగిన రుణమాఫీ, దేశంలో ఇంతవరకు ఎప్పుడూ జరగలేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎర్రమంజిల్‌లోని జలసౌధలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014 తర్వాత బీజేపీ ఎప్పుడూ రుణమాఫీ గురించి మాట్లాడలేదన్న ఆయన, పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ, రైతుల కోసం ఎలాంటి మంచి పనులు చేయలేదని విమర్శించారు.
రైతులను రుణ విముక్తులను చేయాలన్న దృఢ సంకల్పంతో తాము సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ జరగలేదని, వారికి కూడా నూటికి నూరు శాతం రుణమాఫీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే విపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
బీఆర్ఎస్ మళ్లీ వచ్చేది లేదు, సచ్చేది లేదు : అధికారంలో ఉన్నా లేకపోయినా రైతులను మోసం చేయడమే బీఆర్ఎస్కు అలవాటన్న మంత్రి, వారి మోసపూరిత మాటలు నమ్మవద్దని రైతులను కోరారు. బీఆర్ఎస్ మళ్లీ వచ్చేది లేదు, సచ్చేది లేదని అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ ప్రచారం కోసం మాత్రమేనని ఎద్దేవా చేశారు.
"కేంద్రంలో ఉన్న బీజేపీ ఏనాడూ రుణమాఫీ కోసం మాట కూడా మాట్లాడలేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి ఒక ఫ్లాగ్షిప్ స్లోగన్ పెట్టి రైతుల మేలు కోసం ఒక్క అడుగు వేయలేదు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేయడం, గందరగోళ పరిస్థితులను చేస్తున్న విషయాలను యావత్తు తెలంగాణ రైతాంగం గమనించాలని మనవి చేస్తున్నాం."- ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర మంత్రి