Minister Tummala Nageswara Rao on BRS : రుణమాఫీ ప్రక్రియ పూర్తికాకుండానే బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. రూ.2 లక్షల రుణమాఫీకి ఇప్పటికే రూ.31 వేల కోట్ల నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో రుణమాఫీ కాని రైతుల సంఖ్య గురించి ఆ పార్టీ నేతలు మాట్లాడాలని డిమాండ్ చేశారు. అవసరమైతే నిధులు పెంచి రైతులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ కట్టిన సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్ గొప్పలకు పోతోందని హరీశ్‌రావు చేసిన విమర్శలను మంత్రి తిప్పికొట్టారు. ఈ సందర్భంగా ప్రతిపక్షం నిజాయతీగా, మంచి సలహాలు ఇవ్వాలని కోరారు.
తుమ్మల 45 ఏళ్ల రాజకీయ జీవితం :తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను పడిన అవమానాలు చెప్పదలుచుకున్నాని మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు. శ్రీరాముడు, ఖమ్మం జిల్లా ప్రజల దయవల్ల ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు. ఎన్టీఆర్ కాలం నుంచి మంత్రిగా ఉంటూ జిల్లాకు మేలు చేయడానికి ప్రయత్నించానని చెప్పారు. ఖమ్మం జిల్లా నుంచే గోదావరి పారుతున్నా ఆ జలాలు ఈ నేలను పూర్తిగా తడపలేదని, జిల్లాలో మొత్తం భూమికి నీళ్లు ఇవ్వాలనేది తన సంకల్పమని వెల్లడించారు. తాను మంత్రిగా ఉన్న ప్రతిసారి సీఎంలతో మాట్లాడి జిల్లాకు మంచి చేయడానికి ప్రయత్నించానని పేర్కొన్నారు.
నీళ్ల కోసమే కాంగ్రెస్‌లోకి :సత్తుపల్లి, జూలూరుపాడు, వేలేరు ప్రాంతాలకు కూడా నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఖమ్మం జిల్లా రైతులకు నీళ్ల కోసమే గతంలో పార్టీ మారినట్లు తెలిపారు. గత ప్రభుత్వం పలు ప్రాజెక్టుల పనులను పట్టించుకోలేదని విమర్శించారు. రాహుల్‌గాంధీ కోరిక మేరకు ఈసారి కాంగ్రెస్‌లోకి వచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్‌లోకి వచ్చేటప్పుడు కూడా ప్రాజెక్టులు పూర్తి చేయాలని అడిగాను అని తెలిపారు. మంత్రిని కాగానే సత్తుపల్లి టన్నెల్ పనులు ప్రారంభించానని గుర్తు చేశారు.