Minister Seethakka Comments on Govt Officials :రాష్ట్రంలో అధికారుల బదిలీల విషయంలో, ఉన్నతాధికారుల పనితీరుపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో జిల్లాలో ఏర్పాటు చేసిన నాగోబా దర్బార్‌కు ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె ప్రసంగించారు. ఈ సమావేశంలో కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ ఆలం గౌస్, ఐటీడీఏ పీవో కుష్భూ, జిల్లా అటవీ అధికారి(District Forest Officer) పాటిల్ ఆధ్వర్యంలో పాల్గొన్నారు.
Nagoba Darbar 2024 :ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి సీతక్క, అధికారుల పనితీరును ప్రస్తావిస్తూ, చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతాంశంగా మారాయి. ఆదిలాబాద్ జిల్లాకు ఇన్‌ఛార్జి(District Incharge) మంత్రిగా పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో మినహాయిస్తే మళ్లీ రాజకీయాలు మాట్లాడనని స్పష్టం చేసిన ఆమె, తాను చిత్తశుద్ధితో పనిచేస్తానని పునరుద్ఘాటించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో విధులు నిర్వహించే అధికారులు సైతం మానవత్వంతో పనిచేయాలని హితవు పలికారు. ఆదివాసీల ప్రాబల్యం కలిగిన ఉమ్మడి కుమురం భీం జిల్లాలో మానవత్వంతో పనిచేస్తేనే ప్రజలు గుర్తించుకుంటారని పేర్కొన్నారు.
నాగోబా జాతరకు వేళాయే - ఇవాళ అర్ధరాత్రి మహా పూజతో ప్రారంభం కానున్న ఆదివాసీల పండుగ
"ఈ జిల్లా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, అభివృద్ధే లక్ష్యంగా పనిచేద్దామని ప్రజాప్రతినిధులందరికీ పిలుపునిస్తున్నాను. ముఖ్యంగా అధికారులు వారి విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. పనిష్మెంట్ ఉన్న అధికారులను అడవుల్లో వేస్తున్నారని, కానీ మానవత్వం ఉన్న అధికారులు ఈ ప్రాంతానికి అవసరమన్నారు. శిక్ష కోసం ఈ ప్రాంతాలకు అధికారులను వేస్తే, వాళ్లు వచ్చి మన జనాలను శిక్షిస్తారు. పని ఒత్తిడి ఉండే ప్రదేశంలో వేయాల్సినవారిని ఇక్కడ వేయడమేంటి."-సీతక్క, రాష్ట్రమంత్రి