Minister Ponguleti Srinivas Reddy Chit Chat : ధరణి ద్వారా జరిగిన అక్రమాలన్నింటినీ ఆధారాలతో బయటపెట్టి, శ్వేతపత్రం విడుదల చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గత సర్కారు ధరణిని రహస్య డాక్యుమెంట్‌గా చూసిందని, తమ ప్రభుత్వం ఏదీ దాచి పెట్టదని స్పష్టం చేశారు. ధరణిలో ప్రజలకు ఇబ్బంది కలిగించే విషయాలను తొలగించి, మంచి వాటిని కొనసాగిస్తామన్నారు. నేడో, రేపో 5 ఎకరాల వారికి రైతుబంధు పూర్తవుతుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఈ మేరకు మీడియా ప్రతినిధులతో మంత్రి ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
రిజిస్ట్రేషన్ల శాఖను కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని పొంగులేటి పేర్కొన్నారు. విద్యుత్ సమస్య నుంచి బయటపడ్డామని, మంచినీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. వేసవిలో మంచి నీటి ఎద్దడి తలెత్తకుండా ముందు జాగ్రత్తలను గత ప్రభుత్వం తీసుకోలేదని, పైగా తమపై రాళ్లు వేస్తున్నారని పొంగులేటి ఆరోపించారు. తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసే ప్రసక్తే లేదన్నారు. మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో చర్చించి జర్నలిస్టుల సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు.
త్వరలో కొత్త రేషన్‌కార్డుల పంపిణీ : పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి