Minister Nadendla on Grain Collection Arrears:ధాన్యం సేకరణకు సంబంధించి మిగిలిన రూ.674 కోట్ల బకాయిలు పదిరోజుల్లో రైతులకు చెల్లిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టంచేశారు. రైతుల బకాయిలు చెల్లించడాన్నే అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకుని చెల్లిస్తామని అన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రైతు బజార్ల ద్వారా నాణ్యమైన కందిపప్పు, బియ్యాన్ని రాయితీపై ప్రజలకు అందిస్తున్నామన్నారు.
చౌక ధరల దుకాణాల ద్వారా ఇచ్చే సరకులను నాణ్యంగా ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 251 స్టాక్ పాయింట్లను తనిఖీ చేసి నాణ్యత కల్గిన వస్తువులనే ఇవ్వాలని ఆదేశించామని పేర్కొన్నారు. నాణ్యత లేకుండా వస్తువులను పంపిణీ చేసిన 19సంస్థలపై చర్యలు తీసుకున్నామన్నారు. ధాన్యం సేకరణ, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై శాసన మండలిలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానం ఇచ్చారు.