Minister Komatireddy Venkat Reddy Comments on KTR : రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 13 నుంచి 14 సీట్లు గెలవడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శాసనసభ ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో ఏ విధంగా అయితే 50 వేల మెజార్టీ ఇచ్చి ప్రజలు గెలిపించారో, ఇప్పుడూ అదే విధంగా ఎంపీ ఎన్నికల్లో(Lok Sabha Polls) కూడా భారీ మెజారిటీ ఇచ్చి గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మెజారిటీ దేశంలోనే భారీ మెజారిటీ ఉండేలా చూడాలని కోరారు. నల్గొండ పర్యటనలో భాగంగా కనగల్ మండలంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొని మాట్లాడారు.
కేసీఆర్ కుటుంబం లక్షాధికారులై రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్లు అప్పు చేసి మూడేళ్లకే కూలిపోయే విధంగా ప్రాజెక్టులను కట్టిందని మంత్రి ఆరోపించారు. కృష్ణా నదీ ఎండిపోయే విధంగా కేసీఆర్ చేశారని కేసీఆర్‌పై మండిపడ్డారు. డబ్బుల కోసం జగన్ కాళ్ల దగ్గర మోకరిల్లి కృష్ణా, సాగర్ నదులను తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. ప్రగతి భవన్లో జగన్‌కు బిర్యానీ పెట్టి, రోజా ఇంటికి వెళ్లి చేపల పులుసు తిని రాయలసీమను రతనాల సీమగా చేస్తానని చెప్పిన ఘనుడు కేసీఆర్ అని దుయ్యబట్టారు.
కారు షెడ్‌కు కాదు స్క్రాప్ కింద దొంగలు అమ్మేసుకున్నారు : కోమటిరెడ్డి
Minister Komatireddy Fires on BRS :కేటీఆర్ తండ్రి చాటు కుమారుడని, కానీ రేవంత్ రెడ్డి అలా కాదు కింది స్థాయి నుంచి గెలిసొచ్చిన నాయకుడని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. కేసీఆర్ అండతో కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యారని, కానీ ఎలాంటి అండా లేకుండా గెలిచినోల్లం తామని, అదే వారికి తమకు తేడా అంటూ కేటీఆర్(KTR)పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు లేకుండా చేసి, 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని అధికారంలో నిలిపి, ప్రజాపాలన వచ్చే విధంగా ఉంచాలని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.