Minister Komatireddy on Free Electricity Guarantee Implementation : వచ్చే నెల నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు హమీ నెరవేర్చబోతున్నట్లు రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఇవాళ గాంధీభవన్‌లో సమావేశమైన మేనిఫెస్టో కమిటీలో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. హామీల అమలుపై ఇవాళ కమిటీ సమీక్ష చేసిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని స్పష్టం చేశారు.
200 యూనిట్లు కరెంట్ ఇవ్వడం పెద్ద సమస్యేమీ కాదు : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఎన్నికల సమయంలో తాము చెప్పినట్లుగానే 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేసి తీరతామని పునరుద్ఘాటించారు. కేసీఆర్ సర్కార్ నిర్వాకం వల్ల రాష్ట్రం గుల్ల అయ్యిందని, అందువల్లే హామీల అమల్లో కాస్త జాప్యం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నిరుద్యోగ భృతి మొదలుకుని, డబుల్ బెడ్ రూంల వరకు అన్ని హామీలను బీఆర్ఎస్ నేతలు విస్మరించారని విమర్శించారు. ఆ పార్టీ నేతల మాదిరిగా తాము ప్రజలను రెచ్చగొడితే, ఫామ్‌హౌస్ దాటకపోయే వారని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. కాళేశ్వరంతో పాటు అన్ని అక్రమాలపై విచారణ కొనసాగుతోందన్న ఆయన, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి జైలుకు పోవడం ఖాయమని స్పష్టం చేశారు.