YSRCP 12th List:ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ అభ్యర్థుల పేర్లు ఖరారు చేయడంతో పాటుగా, గతంలో ప్రకటించిన అభ్యర్థులను మారుస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే 11 జాబితాల్లో పలువురు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన వైఎస్సార్సీపీ అధిష్టానం, తాజాగా 12వ జాబితాలో మరో ఇద్దరి పేర్లను ప్రకటించింది. అందులో చిలకలూరిపేట అభ్యర్థి మల్లెల రాజేష్ నాయుడు స్థానంలో మనోహర్ నాయుడి పేరును ప్రకటించగా, గత కొంత కాలంగా టికెట్ కోసం ఎదురు చూస్తున్న మంత్రి అమర్నాథ్ను గాజువాక వైఎస్సార్సీపీ సమన్వయ కర్తగా నియమిస్తూ వైఎస్సార్సీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
ఎట్టకేలకు గుడివాడ అమర్నాథ్ పేరు: వైఎస్సార్సీపీ అదిష్టానం మరో రెండు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. గత ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుంచి గెలిచి, మంత్రిగా కొనసాగుతున్న గుడివాడ అమర్నాథ్కు టికెట్ కేటాయించే విషయమై ఆలస్యమైంది. తాజాగా అమర్నాథ్ను గాజువాక సమన్వయకర్తగా ప్రకటిస్తూ వైఎస్సార్సీపీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. మెుదటి లిస్ట్ నుంచి అమర్నాథ్ పేరు ఉంటుందో, ఉండదోననే ఉత్కంఠ కొనసాగింది. అయితే, వైఎస్సార్సీపీ పెద్దలు అప్పట్లో అమర్నాథ్కు ఇచ్చే అంశంపై నిరాసక్తి చూపినట్లు వార్తలు వెలువడ్డాయి. తాజాగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో గుడివాడ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్న వేళ 'కొడిగుడ్డు డైలాగ్తో ఫేమస్' అయిన మంత్రికి ఎట్టకేలకు వైఎస్సార్సీపీ అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. 11 జాబితాల్లో తన పేరు కోసం నిరీక్షించిన మంత్రి అమర్నాథ్కు, సీఎం జగన్ పన్నెండో జాబితాలో మోక్షం ప్రసాదించారు.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలి: రామకృష్ణారెడ్డి