Minister Gottipati on PM Surya Ghar Scheme: పీఎం సూర్యఘర్ పథకానికి కుప్పం నియోజకవర్గం కేరాఫ్ అడ్రెస్‌గా నిలువనుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. కుప్పంలో 53,314 విద్యుత్ కనెక్షన్లు త్వరలోనే సౌర విద్యుత్‌తో అనుసంధానం కానున్నాయని తెలిపారు. సుమారు 2,66,15,521 చదరపు అడుగుల్లో సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశామని తెలిపారు. ఒక నియోజకవర్గంలో భారీ ఎత్తున గృహ విద్యుత్ కనెక్షన్లను సౌర వ్యవస్థతో అనుసంధానించడం ఇదే తొలిసారి అని తెలిపారు. పైలట్ ప్రాజెక్టు సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గాన్ని ఎంచుకుని ప్రారంభించామని మంత్రి స్పష్టం చేశారు.
పీఎం సూర్యఘర్ ద్వారా విద్యుత్ వినియోగదారులు విద్యుత్ చార్జీల భారాన్ని తగ్గించుకోవచ్చునని మంత్రి గొట్టిపాటి తెలిపారు. పీఎం కుసుమ్ ద్వారా వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ విద్యుత్‌ను అనుసంధానం చేయవచ్చునని వివరించారు. అధికంగా ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను డిస్కంలకు అమ్ముకునే సౌలభ్యం కూడా కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతీ ఇంటిని ఓ విద్యుదుత్పత్తి కేంద్రంగా మార్చే దిశగా సీఎం చంద్రబాబు ముందడుగు వేస్తున్నారని అన్నారు.