Manda Krishna Madiga Fires On CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేయకుండానే ఉద్యోగాల భర్తీని వేగవంతం చేశారని నమ్మక ద్రోహం చేసి మాదిగలను నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. సీఎం మాలలకు కొమ్ముకాస్తూ మాదిగలకు ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎంపై ఆరోపణాస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలని పిలుపునిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రాల్లో అంబేడ్కర్ విగ్రహాల నుంచి కలెక్టర్ కార్యాలయాల వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టి కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
మాలల పక్షాన నిలుస్తున్నారు : హైదరాబాద్ ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి బషీర్‌బాగ్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. సీఎం మాదిగల పట్ల ఎనలేని ప్రేమ ఉన్నట్లుగా మాట్లాడుతూ ఆచరించకుండా మాలల పక్షాన నిలుస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. శాసనసభ ఎన్నికల్లో మాదిగల నాలుగు సీట్లు తగ్గడానికి రేవంత్ రెడ్డే కారణమని దుయ్యబట్టారు. వివేక్, వినోద్ ఇద్దరు ఎమ్మెల్యేలుండగా వంశీకి ఎంపీ టికెట్ ఇచ్చారని ఆక్షేపించారు.