Lok Sabha Candidates Educational Qualifications in Telangana : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల విద్యార్హతలు గురించి ఓ లుక్కేద్దామా? అయితే మీరే చూడండి ప్రధాన పార్టీల అభ్యర్థులు 51 మంది ఉంటే అందులో మూడో వంతు మంది అనగా 17 మంది అభ్యర్థులు ఇంటర్, ఆలోపే చదువుకున్నారు. ఐదుగురు వైద్యులు కాగా, మజ్లిస్ అభ్యర్థితో కలిపి ఐదుగురు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఒక మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎన్నికల బరిలో నిలిచి వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
అభ్యర్థుల అఫిడవిట్లలలో పొందుపరిచిన విద్యార్హతలు :
- ప్రధాన పార్టీల తరఫున బరిలో ఉన్న వారిలో పదో తరగతి అంతకంటే తక్కువ చదివినవారు ఆరుగురు కాగా, ఇంటర్మీడియట్ చదివినవారు 11 మంది ఉన్నారు.
- అఖిల భారత స్థాయి అధికారులు ముగ్గురు ఉన్నారు. వారిలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి మెదక్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయగా, నాగర్ కర్నూల్ నుంచి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచారు. మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్ నల్గొండ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
- విదేశాల్లో ఐదుగురు అభ్యర్థులు చదువుకున్నారు. ముందుగా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హార్వర్డ్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేశారు. హైదరాబాద్ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ లండన్‌లో లా పూర్తి చేయగా, చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అమెరికాలో ఎంఎస్ పూర్తి చేశారు. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అమెరికాలో గ్రాడ్యుయేషన్ చేయగా, భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి సైప్రస్‌లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేశారు.
- వైద్యులు :చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి వెటర్నరీ సైన్స్‌లో మాస్టర్స్(ఎంవీఎస్సీ) పూర్తి చేశారు. మల్లు రవి(కాంగ్రెస్), కడియం కావ్య(కాంగ్రెస్), బూర నర్సయ్యగౌడ్(బీజేపీ), సుధీర్‌కుమార్(బీఆర్ఎస్)లు ఎంబీబీఎస్, ఆపై చదువులు చదువుకొని వైద్యులుగా సేవలందించారు.
- పీహెచ్‌డీ, పీజీ : మహబూబాబాద్ బీజేపీ అభ్యర్థి ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ పీహెచ్‌డీ పూర్తి చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి సహా 11 మంది పోస్టుగ్రాడ్యుయేట్లు. ఇందులో 10 మంది ఎంఏ, ఒకరు ఎంబీఏ చేశారు. ఒకరు బీటెక్ చేయగా మరో 10 మంది వివిధ డిగ్రీలు చదివారు. బీబీ పాటిల్(బీజేపీ), సురేశ్ షెట్కార్(కాంగ్రెస్)లు మహారాష్ట్రలో ఏజీ బీఎస్సీ చేశారు. ఈ ఇద్దరు నేతలు జహీరాబాద్‌లో తలపడుతున్నారు. టి.జీవన్‌రెడ్డి(కాంగ్రెస్), బి. వినోద్‌కుమార్(బీఆర్ఎస్), రఘునందన్‌రావు(బీజేపీ)లు న్యాయ విద్య(ఎల్ఎల్బీ) చదివారు. ఇద్దరు డిప్లొమా పూర్తి చేశారు.