అవమానాలు, అనిశ్చితికి తెర - ఎంపీ లావు రాజీనామాకు కారణమదే! Lavu Srikrishna Devarayalu Joins in TDP: తిట్టమంటే తిట్టాలి. పొమ్మంటే పోవాలి. రమ్మంటే రావాలి. ఇవన్నీ చేతకాదంటే ఆత్మాభిమానాన్ని చంపుకొని ఓ మూలన పడి ఉండాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అలా చేయలేకే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు జగన్‌కు గుడ్ బై చెప్పేశారా. అసలింతకీ లావు లెక్కేంటి. లావు వల్ల జగన్‌కు వచ్చిన చిక్కేంటి. శ్రీకృష్ణదేవరాయలు తదుపరి పయనమెటు.
లావు శ్రీకృష్ణదేవరాయులు. విద్యాధికుడు. సౌమ్యుడు. ఉంటే దిల్లీలో, లేదంటే నియోజకవర్గంలో వివాదాలకు దూరంగా ఉంటారు. వైరిపక్షాలూ, వేలెత్తి చూపే అవకాశం ఇవ్వని రీతిలో తన పనితాను చేసుకెళ్తుంటారు. సొంతపార్టీ నేతలు కూడా రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అని అంతర్గతంగా చెప్పుకుంటారు.
అలాంటి ప్రజాప్రతినిధికి ఎవరైనా కావాల్సినంత ప్రోత్సాహం ఇస్తారు. కానీ, జగన్ మాత్రం పొమ్మనలేక పొగపెట్టేశారు. 2019 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసిన లావు శ్రీకృష్ణదేవరాయులు వైఎస్సార్సీపీ నుంచి నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. సొంత నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్రం నుంచి ఎంతో కొంత సాయం తెచ్చుకున్న ముగ్గురు వైఎస్సార్సీపీ ఎంపీల్లో లావు కూడా ఒకరు.
వైఎస్సార్సీపీకి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా
నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన పనులపై ప్రణాళికలు వేసుకుని కేంద్రంలో ఆయా మంత్రిత్వ శాఖల్లో ఫాలోఅప్ చేసుకుంటూ కావాల్సిన నిధులైతే తెచ్చుకోగలిగారు. కానీ, వైఎస్సార్సీపీ సిలబస్‌కు అనుగుణంగా నోరుపారేసుకోలేక పోవడం జగన్ దృష్టిలో ఎంపీకి మైనస్‌గా మారింది. సొంత పార్టీ నేతలు లావును చికాకుపెడుతున్నా అధిష్టానం అండగా నిలవలేదు.
నరసరావుపేట లోక్‌సభ పరిధిలోని వినుకొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని వర్గాల నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా లావు శ్రీకృష్ణదేవరాయలకు పార్టీ అధినాయకత్వం నుంచి ఎలాంటి మద్దతూ లభించలేదు. ఐనా ఆయన సర్దుకుపోయారు.
మా స్వరం బలహీనం కాదు.. పోలవరం, రైల్వేజోన్,స్టీల్ ప్లాంట్ పై బాధేస్తోంది: వైసీపీ ఎంపీలు
ఇదే సమయంలో లావుకు అధిష్టానం తగిన గౌరవం కూడా ఇవ్వలేదు. విడదల రజినిని చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమకు మార్చడం, చిలకలూరిపేట సమన్వయకర్తగా రాజేష్ నాయుడిని నియమించేటప్పుడూ సిట్టింగ్ ఎంపీగా కనీస సమాచారమే ఇవ్వకుండా అవమానించారు. పైగా ఆయన్ను కూడా నరసరావుపేట నుంచి గుంటూరు పార్లమెంట్ స్థానానికి మార్చాలని జగన్ నిర్ణయించారు.
గుంటూరు పార్లమెంట్ స్థానానికి మారాలనే ప్రతిపాదనను శ్రీకృష్ణదేవరాయలు తిరస్కరించారు. పల్నాడు జిల్లాలోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కూడా శ్రీకృష్ణదేవరాయలువైపే నిలబడ్డారు. నాలుగైదుసార్లు నేరుగా జగన్‌ను కలిసి నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా లావునే కొనసాగించాలని పట్టుబట్టారు. సర్వేల్లోనూ లావుకు సానుకూలతే వచ్చింది.
ఎన్ని ఫలితాలు ఎలా ఉన్న జగన్ ఇవేవీ పరిగణలోకి తీసుకోలేదు. లావు కూడా వెనక్కి తగ్గలేదు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానంలో మరో అభ్యర్థిని తీసుకువచ్చేందుకు వైఎస్సార్సీపీ అధినాయకత్వం ప్రయత్నిస్తుండడాన్ని అవమానంగా భావించారు. 15రోజులుగా నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ రాజీనామా ప్రకటించారు.
MP Lavu Srikrishnadevarayalu: 'విభజన నాటి నుంచి ఏపీ ఆర్థిక సంక్షోభంలో ఉంది'
వైఎస్సార్సీపీ వ్యుహమిదే: లావు శ్రీకృష్ణదేవరాయలును వైఎస్సార్సీపీ గుంటూరు లోక్‌సభ నుంచి బరిలో నిలపాలనుకోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు చర్చ జరుగుతోంది. రాజధాని అమరావతి గుంటూరు లోక్‌సభ పరిధిలో ఉంది. అమరావతిని వైఎస్సార్సీపీ సర్కార్ పూర్తిగా నాశనం చేసింది. రైతుల సుదీర్ఘ ఉద్యమాన్ని ఎదుర్కోవడం ఇప్పుడు ఆ పార్టీకీ గండంగా మారింది.
రైతుల ఉద్యమం వల్ల వివాద రహితుడు, స్థానికుడైన లావును బరిలో దించితే కొంతైనా సానుకూలత ఉంటుందనేది వైఎస్సార్సీపీ అధిష్ఠానం ఎత్తుగడగా చెప్తున్నారు. ఇందుకోసమే శ్రీకృష్ణను రాజకీయ బలిపీఠం ఎక్కించేందుకు జగన్ సిద్ధమయ్యారు. కానీ శ్రీకృష్ణ తాను నరసరావుపేట నుంచే పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. వైఎస్సార్సీపీని వీడిన ఎంపీ లావు సైకిల్ ఎక్కుతారనే ప్రచారం జరుగుతోంది. ఆయనను టీడీపీ నేతలు సంప్రదించగా పార్టీలో చేరేందుకు ప్రాథమికంగా సమ్మతించినట్లు తెలుస్తోంది.
కేంద్ర మంత్రికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లేఖ