Land Encroachments in Dharmavaram: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం సమీపంలోని రేగాటిపల్లిలో కాలన్తజేషన్ కోఆపరేటివ్ సొసైటీని బ్రిటీషు కాలంలో ఏర్పాటు చేశారు. ఈ సొసైటీ ఆధీనంలో ఉన్న 13 వందల ఎకరాల భూమిని గ్రామంలోని 72 కుటుంబాలకు చెందిన రైతులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తూ వచ్చారు. 1995లో అప్పటి రాష్ట్రప్రభుత్వం సొసైటీని రద్దుచేసింది. పరిటాల రవీంద్ర ఆధ్వర్యంలో గ్రామంలోని 93 కుటుంబాలకు 5 ఎకరాల చొప్పున భూమిని పంపిణీ చేసి పట్టాలు ఇచ్చింది.
మిగిలిన 800 ఎకరాల భూమిని గ్రామస్థులు అనధికారికంగా సాగు చేసుకుంటూ ఉండేవారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 300 ఎకరాలను ఇళ్ల స్థలాల కోసం తీసుకున్నారు. ఆ భూముల్లో సాగులో ఉన్న పేదలకు పరిహారం సైతం ఇవ్వలేదు. 2009, 2012 సంవత్సరాల్లో భూమిని పంపిణీ చేస్తాం అంటూ మరో 300 ఎకరాలు పంచారు. మిగిలిన 500 ఎకరాలపై కన్నేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అనుచరులు రెవెన్యూ అధికారిణి సహకారంతో భూ పంపిణీ పేరుతో రాయించేసుకున్నారు. ఇలా సుమారు 200 ఎకరాల వరకు పంచేశారు.
గుడ్‌మార్నింగ్ ముసుగులో ఆస్తులపై రెక్కీ! - భూములు, వ్యాపారాలు ఆయన కన్నేస్తే కనుమరుగే
ఎమ్మెల్యే అనుచరుడి కనుసన్నల్లోనే: ప్రభుత్వ భూముల్లో అనధికారికంగా సాగు చేసుకుంటున్న పేదలకు పట్టాలు పంపిణీ చేయాలని 2021లో వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే అదనుగా భావించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచరులు రేగాటిపల్లెలో 200 ఎకరాలు కొట్టేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అప్పటికే వారంతా ఆ భూములను సాగుచేసుకుంటున్నట్లు రికార్డులు సృష్టించి భూ పంపిణీకి దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డికి ప్రధాన అనుచరుడైన రేగాటిపల్లి సర్పంచ్ సురేశ్‌రెడ్డి కనుసన్నల్లోనే ఈ దందా సాగింది.
సర్పంచి కుటుంబసభ్యులు, బంధువుల పేరిట 200 ఎకరాలకు సాగుపట్టాలు సిద్ధం చేసి ఎమ్మెల్యే చేతుల మీదుగానే పంపిణీ చేశారు. మొత్తం 43 మందికి ఐదెకరాల చొప్పున ఇవ్వగా, ఇందులో 36 మంది ఎమ్మెల్యే అనుచరులే ఉన్నారు. వీరందరికీ ఇతర భూములు కూడా ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కుటుంబంలో ఏ ఒక్కరి పేరిట భూమి ఉన్నా, వారు భూ పంపిణీకి అనర్హులు. ఇవేమీ పట్టించుకోకుండా సుమారు 200 కోట్ల విలువైన భూములు వారికి అప్పనంగా దోచిపెట్టారు.