MLA Ravindranath Reddy Sensational Comments on Viveka Case: ఎంపీ వివేకానందరెడ్డి హత్యపై సీఎం జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యకు సంబంధించిన ఆధారాల్ని ఎర్ర గంగిరెడ్డి తుడిచేస్తుంటే, ఎంపీ అవినాష్ రెడ్డి అమాయకంగా చూస్తూ నిలబడ్డారని చెప్పారు. వైఎస్సార్ జిల్లా వీరపునారాయునిపల్లి మండలం మొయిళ్లకాల్వలో 2 రోజుల కిందట నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.
అవినాష్ రెడ్డిని చూపిస్తూ రవీంద్రనాథ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. బాబాయి హత్య కేసులో ఆధారాలు తుడిచేస్తుంటే రక్త సంబంధీకుడైన అవినాష్ చూస్తూ ఎలా ఊరుకున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేకపోతే, కనీసం పోలీసులకైనా ఫిర్యాదు చేయాలి కదా? కానీ ఎందుకు చెప్పలేదు? అనే అనుమానాలు వేలెత్తి చూపిస్తున్నాయి.
వివేకా హత్యతో సంబంధం లేదని అవినాష్ అప్పుడే చెప్పొచ్చు కదా: షర్మిల - YS Sharmila on MP Avinash Reddy
వివేకా హత్యకు కుట్ర పన్నటమే కాకుండా, హత్యానంతరం ఆధారాల ధ్వంసానికి అవినాష్ రెడ్డి పాల్పడ్డారని సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. కాగా అవినాష్ చూస్తుండగానే ఆధారాల్ని ధ్వంసం చేశారని చెప్పటం ద్వారా సీబీఐ అభియోగాలు నిజమేనని రవీంద్రనాథ్ రెడ్డి వెల్లడించినట్లయింది. రవీంద్రనాథ్‌రెడ్డి మాటల్ని వింటూ మౌనంగా ఉండిపోవటంతో ఆధారాల ధ్వంసం విషయం తనకు తెలుసని పరోక్షంగా అవినాష్ రెడ్డి అంగీకరించినట్లయింది.
గంగిరెడ్డి ఆధారాలు తుడుస్తుంటే అవినాష్ చూస్తూ నిలబడ్డారు - రవీంద్రనాథ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు "హత్యానంతరం శివప్రకాశ్‌రెడ్డి ఫోన్ చేస్తే ఎంపీ అవినాష్ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లారు. గంగిరెడ్డి ఏదో చేస్తుంటే అవినాష్ అమాయకంగా చూస్తూ నిలబడి ఉన్నారు తప్ప ఆయనేమీ తుడవలేదు. వివేకా హత్యలో గంగిరెడ్డి పాత్ర అయితే కచ్చితంగా ఉంది. గంగిరెడ్డి, వివేకానందరెడ్డి ఇద్దరూ మంచి స్నేహితులు. ఒకే మంచంలో పడుకుని, ఒకే కంచంలో తినేంత సన్నిహితులు. ఈ నేపథ్యంలో గంగిరెడ్డి ఆధారాలు ధ్వంసం చేస్తుంటే అవినాష్ ఆపలేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే వివేకాకు ఎంతో సన్నిహితంగా ఉండే వ్యక్తి ఏదో చేస్తున్నారని అనుకుని ఉండొచ్చు. ఆ సమయంలో అమాయకంగా చూస్తూ నిలబడిపోయిన అవినాష్ ఈ విషయం ప్రజలకు తెలియజేసే కార్యక్రమం చేశారు."- రవీంద్రనాథ్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. పుట్టింటివాళ్లు బాగుండాలని ఆడపడుచులు కోరుకుంటారని, అయితే షర్మిల మాత్రం చెడు కోరుకుంటున్నారని మండిపడ్డారు. ఆమె టీడీపీ అధినేత చంద్రబాబుతో కుమ్మక్కై వైఎస్సార్సీపీపై బురద జల్లుతున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఆమెను ఓడించి, అవినాష్ రెడ్డిని భారీ మెజార్టీతో ఎంపీగా గెలిపించాలని కోరారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని అమ్ముకున్నట్లు, తెలంగాణలో పార్టీని అమ్మేసిన షర్మిల ఆంధ్రకు వచ్చారని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు.
నేను బయటకు వెళ్లాక నరికి చంపినా ఆశ్చర్యపడనక్కర్లేదు: సునీత - YS Vivekananda Reddy murder Case