KTR Speech at BRS Party Meeting in Siricilla : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు తప్పించుకునేందుకే రోజుకో అవినీతి కథ అల్లుతుందని బీఆర్ఎస్ పార్టీ(BRS Party) కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల విషయంలో అవినీతి జరిగి ఉంటే, వెలికి తీయమనే చెబుతున్నట్లుఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.
గతంలో చాలామంది బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, గులాబీ పార్టీని తొక్కేస్తామని విమర్శించి ఎన్నికల పోటీలోనే లేకుండా పోయారని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టులో(Medigadda Project) అవినీతి, మరోచోట అక్రమాలు జరిగాయని కథలు చెబుతున్నారని తెలిపారు. అధికారం వారి చేతుల్లోనే ఉందని, అవినీతిని వెలికితీయమనే చెబుతున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్, బీజేపీ ఫెవికాల్ బంధాన్ని మైనార్టీ సోదరులు గుర్తించాలి : కేటీఆర్
అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేకాని ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తప్పించుకుంటే మాత్రం వదిలిపెట్టమని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ(Free Bus Travel) పథకంలో భాగంగా బస్సుల సంఖ్య పెంచాలని కోరారు. దీని వల్ల నష్టపోతున్న ఆటో సోదరులను సైతం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే బలమైన గొంతు దేశంలోనే లేదన్నారు.
కేసీఆర్ అధికార ప్రభుత్వంలో కంటే, ప్రతిపక్ష హోదాలో ఉంటేనే చాలా ప్రమాదం. ఎందుకంటే అద్భుతంగా ప్రజల పక్షాన చీల్చి చెండాటంలోనూ, సమస్యలపై గొంతు విప్పటంలోనూ కేసీఆర్ కంటే పదునైన గొంతు బహుశా భారతదేశంలోనే ఎక్కడా లేదు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీని వంద మీటర్ల లోతులో తొక్కుతానంటున్నారు. మరోవైపు బీజేపీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీనే లేకుండా చేయాలని కలలు కంటున్నారు. గతంలో పెద్ద పెద్దవాళ్ల వల్లే కాలేదు ఇలాంటి వారివల్ల ఏమైనా అవుతుందా?-కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే