BRS Leader KTR MP Election Campaign : లోక్‌సభ ఎన్నికల్లో 10 నుంచి 12 సీట్లు ఇవ్వండి ఏడాదిలోపు కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్, బీజేపీ ఏం చెప్పినా వినలేదని కేవలం కేసీఆర్‌నే కావాలని అన్నారని తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అడ్డగుట్టలో జరిగిన రోడ్‌షో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
2014లో బడా భాయ్ మస్తు కథలు చెప్పారని జన్‌దన్ ఖాతా తెరవండి రూ.15 లక్షలు ఖాతాల్లో వేస్తామని అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఇస్తామని, నీళ్లు ఇస్తామని, బుల్లెట్ రైలు పరుగులు పెట్టిస్తానని, నల్లధనం వాపస్ తెస్తానని అన్నారని కానీ ఏం చేయలేదని ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఐదేళ్లలో కుర్కురేలు పంచారని ఒక్క పని చేయలేదని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో వరదలు వస్తే రూపాయి కూడా సాయం చేయలేదు కానీ గుజరాత్లో వస్తే మాత్రం హెలికాప్టర్లో వెళ్లి నిధులు ఇచ్చారని తెలిపారు. మరి అక్కరకు రాని కిషన్ రెడ్డి అవసరం లేదని పేర్కొన్నారు.
స్కూటీ లేదు కాంగ్రెస్ లూటీనే : ప్రధానిగా మోదీ వచ్చిన తర్వాత రూ.400 ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు రూ.1200లకు చేరిందని కేటీఆర్ చెప్పారు. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలను బీజేపీనే పెంచేసిందన్నారు. తాను చెప్పేది తప్పు అయితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అన్ని పెంచీ రూ.30 లక్షల కోట్లు వసూలు చేశారని, అందులో నుంచి రూ.14 లక్షల కోట్లను అంబానీ, అదానీలకు రుణమాఫీ చేశారని ఆరోపించారు. పేదలను కొట్టి పెద్దలకు ఆ డబ్బును పంచారన్నారు. ఇప్పుడు చోటా భాయ్ రేవంత్ రెడ్డి నెలకు రూ.2,500, స్కూటీ అన్నారని, కానీ స్కూటీ లేదు కాంగ్రెస్ లూటీ మొదలైందని కేటీఆర్ దుయ్యబట్టారు.