KTR Fires on Congress Government :కాంగ్రెస్ చెప్పిన మార్పంటే కరెంటు కోతలు, ఐటీ కంపెనీల తరలింపేనా అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్, హనుమకొండలో జరిగిన పట్టభద్రుల సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. రైతు బంధు డబ్బులు నాట్ల సమయానికి కాకుండా ఓట్ల సమయానికే పడుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా రాష్ట్రంలో రుణమాఫీ చేయలేదని ఎద్దేవా చేశారు.
అన్ని వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రశ్నించే గొంతు కావాలో, యూట్యూబ్‌ను అడ్డుపెట్టుకొని దందా చేసే వ్యక్తి కావాలో గ్రాడ్యుయేట్స్ తేల్చుకోవాలని అన్నారు. మోసాల పరంపర కొనసాగిస్తున్న కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
"ఇక్కడేమో గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు. కాంగ్రెస్లోనేమో గోల్డ్ ఎత్తుకుని పోయేవాడు ఉన్నాడు. చదువుకున్నవారి ఎలాంటి వ్యక్తి ప్రతినిధిగా ఉండాలి. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాడు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రశ్నించే గొంతు కావాలో, యూట్యూబ్‌ను అడ్డుపెట్టుకొని దందా చేసే వ్యక్తి కావాలో గ్రాడ్యుయేట్స్ తేల్చుకోవాలి. కాంగ్రెస్ చెప్పిన మార్పంటే కరెంటు కోతలు, ఐటీ కంపెనీల తరలింపేనా? రైతు బంధు డబ్బులు నాట్ల సమయానికి కాకుండా ఓట్ల సమయానికే పడుతున్నాయి."- కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు