KTR Meeting With Malkajgiri BRS Leaders :హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి సంబంధించి బీఆర్ఎస్ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమీక్షకు పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డి సహా పార్లమెంటు నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంటు ఎన్నికలపై నేతలు, కార్యకర్తల నుంచి నేతలు అభిప్రాయాలు స్వీకరించారు. ఈ సమావేశంలో మాట్లాడిన కేటీఆర్, శాసనసభ ఎన్నికల్లో దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
200 యూనిట్లలోపు విద్యుత్ బిల్లులు జనవరి నుంచి కట్టొద్దని రేవంత్ రెడ్డి, నవంబర్ నుంచే కట్టొద్దని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. వారి మాటలనే తాను గుర్తు చేశానన్న కేటీఆర్, నిజాలు మాట్లాడితే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు విధ్వంసకర మనస్తత్వంగా కనిపిస్తుందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. సోనియానే (Sonia Gandhi) బిల్లులు కడుతుందని కాంగ్రెస్ నేతలు చెప్పారని, బిల్లులు ఆవిడకే పంపుదామని అన్నారు.
KTR on Congress Leaders : నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ తప్పించుకున్నట్లే పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదాపై మాట మార్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ హామీల నుంచి తప్పించుకుంటున్న తీరును ప్రజా కోర్టులోనే సాధికారికంగా ఎండగట్టాలని నేతలకు సూచించారు. ప్రగతి భవన్‌లో విలాసవంతమైన సౌకర్యాలు అంటూ దుష్ప్రచారం చేశారన్న కేటీఆర్, విలాసాలు ఉంటే అక్కడ ఉంటున్న భట్టి ఇప్పటికే టాంటాం చేయక పోయేవారా? అని ప్రశ్నించారు.
కారు కేవలం సర్వీసింగ్‌కు వెళ్లిందన్న కేటీఆర్, మళ్లీ రెట్టింపు వేగంతో పరుగెత్తుతుందని పునరుద్ఘాటించారు. మోదీకి (PM Modi), రేవంత్ రెడ్డికి భయపడే పార్టీ బీఆర్ఎస్ కాదన్న కేటీఆర్, దిల్లీలో తెలంగాణ గొంతుక వినబడాలంటే బీఆర్ఎస్ గెలవాలని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణ గొంతుక బీఆర్ఎస్ను ఖతం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు.