KTR letter to TG Govt Against New Laws : దేశంలో అమల్లోకి వచ్చిన నూతన న్యాయచట్టాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి తెలపాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి బహిరంగలేఖ రాశారు. తెలంగాణ అంటేనే పోరాటాలగడ్డ, ఉద్యమాల అడ్డ అని, పౌరహక్కుల పరిరక్షణ కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడే స్వభావం ఉన్న నేల ఇదని లేఖలో పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య హక్కుల కోసం ఉక్కు పిడికిళ్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయని, అలాంటి తెలంగాణ రాష్ట్రంలోనూ ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన చట్టాలతో అలజడి రేగుతోందని కేటీఆర్ తెలిపారు. నూతన న్యాయ చట్టాలపై అనేక ఆందోళనలు నెలకొన్నాయన్న ఆయన, అందులోని వివిధ సెక్షన్లపై పలు వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.
న్యాయ చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి : పలు నిబంధనలు, సెక్షన్లు ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా, వ్యక్తి స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని హక్కుల సంఘాల ప్రజామేధావులు అభిప్రాయపడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిరసనలు, ఉద్యమాలు చేసే ప్రజలకు ప్రతికూలంగా కొత్త చట్టాలు ఉన్నాయని, ప్రభుత్వం, పోలీసులకు మితిమీరిన అధికారాన్ని కట్టబెడుతున్నాయని సామాజిక ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
ప్రజాస్వామిక వాదులు, న్యాయ నిపుణులు మాత్రమే కాదు, పలు రాష్ట్రాలు కూడా నూతన చట్టాలను వ్యతిరేకిస్తున్నాయని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ఇక్కడి కాంగ్రెస్ పార్టీ తన వైఖరి ఏంటో స్పష్టం చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంలో తన వైఖరిని స్పష్టం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
కొత్త న్యాయ చట్టాల్లోని సెక్షన్‌లు ప్రాథమిక హక్కులకు విఘాతం : న్యాయకోవిదులు, అనుభవజ్ఞులైన క్రిమినల్ లాయర్లు, దర్యాప్తు సంస్థలు, న్యాయమూర్తులు, సాధారణ పౌరులతో విస్తృత స్థాయిలో సంప్రదించి, అభిప్రాయాలను సేకరించకుండానే ఈ చట్టాలను తొందరపాటుతో తీసుకొచ్చారని ఆక్షేపించారు. లోక్‌సభ, రాజ్యసభ నుంచి ఏకంగా 146 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేసి, ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించిన చట్టాల అమలు నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలయ్యాయని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా చట్టాల అమలు నిలిపి వేయాలని సుప్రీంకోర్టులో కేసు వేసినట్లు తెలిపారు. పలు నిబంధలను, సెక్షన్లు అత్యంత దారుణంగా ప్రజల హక్కులను, స్వేచ్చను హరించేలా ఉన్నాయని, నిందితులకు బెయిల్ ఇచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల హక్కులకు హాని కలిగించే కొన్ని ముఖ్యమైన అంశాలను లేఖలో ప్రస్తావించారు.
KTR Comments on New Laws : కొత్త చట్టాల ప్రకారం ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేయడం నేరమని, ఇది అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాటం చేసే పౌరులకు ప్రమాదకారిగా మారుతుందని అన్నారు. గతంలో ఉన్న 15 రోజుల పోలీసు కస్టడీ ఇప్పుడు 90 రోజులకు పెంచారని, ఆ గడువులో ఎన్ని సార్లయినా కస్టడీలోకి తీసుకునే అవకాశం కల్పిస్తుందని, తద్వారా నిందితుడికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసినప్పటికీ పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుందని కేటీఆర్ తెలిపారు.
క్రిమినల్ కేసులో ఉన్న నిందితుల ఆస్తులను జప్తు చేయడానికి కోర్టు అనుమతి అవసరం లేకుండానే పోలీసులకు పూర్తి అనుమతి లభించిందని అన్నారు. వ్యవస్థీకృత నేరాలకు వ్యక్తులను ప్రాసిక్యూట్ చేయడానికి దర్యాప్తు సంస్థలకు ఏకపక్ష, విచక్షణాధికారాలను కొత్త చట్టం అనుమతిస్తోందని తెలిపారు. జాతీయ భావాలను ప్రభావితం చేసే నేరాలకు మూడేళ్ల జైలుశిక్ష, జరిమానా, సైబర్ నేరాలు, హ్యాకింగ్, ఆర్థిక నేరాలు, గోప్యత, సాంకేతికత ద్వారా విధ్వంసం వంటి వాటి కోసం రూపొందించిన ప్రత్యేక అధ్యాయంలో అనేక అస్పష్టతలున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కారు తన నిర్ణయాన్ని ప్రకటించాలి :స్వాతంత్య్రోద్యమంలో నాటి జాతీయ నాయకులను జైళ్లలో పెట్టడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఉపయోగించిన ‘రాజద్రోహ’ చట్టం అమలును సుప్రీంకోర్టు 2022లో నిలిపివేసిందని, కొత్త చట్టంలో తిరిగి ‘రాజ ద్రోహం’ చట్టాన్ని ‘దేశ ద్రోహం’ పేరుతో తీసుకొచ్చిందని తెలిపారు. ప్రభుత్వ విధానాలను విమర్శించడానికి ప్రజలకు ఉన్న హక్కును కాలరాసేందుకే ఈ చట్టం ఉపయోగపడుతుందన్న విమర్శలున్నాయని పేర్కొన్నారు.
ప్రజా ఉద్యమాలకు దశాబ్దాలుగా కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న తెలంగాణ గడ్డపై నిరంకుశ, నియంతృత్వ నూతన క్రిమినల్ చట్టాలను ఇక్కడ యథాతథంగా అమలు చేయడమే రాష్ట్ర సర్కారు లక్ష్యమా, లేక ఇతర రాష్ట్రాల తరహాలో సవరణలు తీసుకొస్తారా అన్న విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టం చేయాలని కోరారు. కొత్త చట్టాల్లో పేర్కొన్న అనేక సెక్షన్ల ద్వారా రాష్ట్రంలో పోలీస్ రాజ్యాన్ని తీసుకొచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
గత ఏడు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్న విద్యార్థులు, యువకులు, సోషల్ మీడియా కార్యకర్తలను ఎక్కడికక్కడ అణిచివేసేందుకు పోలీసులను విస్తృతంగా వినియోగిస్తున్నారని, నూతన చట్టాల నేపథ్యంలో ఈ పరిణామాలు మరింత దుర్మార్గమైన వాతావరణాన్ని నెలకొల్పే ప్రమాదం ఉందని అన్నారు. పౌరులను అణచివేసే చట్టాలు, అందులోని సెక్షన్లపై రాష్ట్ర పరిధిలో ఉన్న మేరకు ఒక కమిటీని వెంటనే నియమించి చర్చించాలని, లేని పక్షంలో ప్రజలు నిరంకుశ ప్రజావ్యతిరేక ప్రభుత్వంగా పరిగణిస్తారని గుర్తుంచుకోవాలని కేటీఆర్ లేఖలో తెలిపారు.
'15,000,000,000,000 - 15 పక్కన ఇన్ని సున్నాలా!! - మూసీ అభివృద్ధి వ్యూహం వెనక ఉద్దేశమేంటి' - KTR On Musi River Development
రేపు మధ్యాహ్నం బీఆర్ఎస్ఎల్పీ భేటీ - బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ - BRSLP Meeting on July 23rd