KTR Condemned Police Attack On BRS Activists :వికారాబాద్ నియోజకవర్గం మర్పల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తలు నవీన్, ప్రవీణ్‌పై స్థానిక ఎస్సై, పోలీసులు దాడి చేసిన ఘటనపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ నేతృత్వంలో బాధితులు తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను కలిశారు. పోలీసులు తమపై దాడి చేసిన తీరును కేటీఆర్‌కు వివరించారు. వారికి ధైర్యం చెప్పిన కేటీఆర్, పార్టీ మొత్తం అండగా ఉంటుందని, అవసరమైతే తాను కూడా వికారాబాద్ వచ్చి ఆందోళన చేస్తానని భరోసా కల్పించారు.
ధైర్యం కోల్పోవద్దని కార్యకర్తలకు సూచించారు. బాధితులకు పూర్తిగా న్యాయసాయాన్ని పార్టీ లీగల్ సెల్ ద్వారా అందిస్తామని ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్‌కు వెళ్లి దాడిపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలపై దాడులు చేస్తూ అక్రమ కేసులతో వేధిస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమన్న కేటీఆర్, తమ హయాంలో కాంగ్రెస్, బీజేపీ వారికి కొట్టాలని పోలీసులను ఎప్పుడూ పురమాయించలేదని తెలిపారు. దాడులు చేస్తున్న వారి పేర్లు రాసి పెట్టుకోవాలని కార్యకర్తలకు కేటీఆర్ సూచించారు.
శంకరగిరి మాన్యాలు పట్టించే బాధ్యత నాదే :బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి వారిని శంకరగిరి మాన్యాలు పట్టించే బాధ్యత తనదేనని అన్నారు. పక్క రాష్ట్రంలో ఇలాగే ఎక్స్‌ట్రాలు చేసినందుకు ముగ్గురు ఎస్పీ స్థాయి అధికారులనే పక్కన పెట్టారని కేటీఆర్ గుర్తుచేశారు. ఎస్సైలు, సీఐలు ఎక్స్‌ట్రాలు చేస్తే వాళ్లను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డ కేటీఆర్, స్వయంగా ముఖ్యమంత్రే గూండా తరహాలో కొంతమంది గూండాలను ఎస్కార్ట్ పెట్టి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపైకి దాడికి పంపారని ఆరోపించారు.