KCR's Brother Son Kalvakuntla Kanna Rao Arrested : తెలంగాణలోని మన్నెగూడ భూవివాదం కేసులో కల్వకుంట్ల కన్నారావుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మన్నెగూడలోని రెండు ఎకరాల భూ వివాదం కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావును ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
అసలేం జరిగిందంటే.. ఓఎస్‌ఆర్ ప్రాజెక్ట్ ఎల్‌ఎల్‌పీ అనే వెంచర్లో మన్నెగూడలో సర్వే నంబర్ 32/బుు లో సుమారు రెండు ఎకరాల భూమి ఉంది. కాగా గత నెలలో తమకు చెందిన ఈ భూమిని కన్నారావు కబ్జాకి యత్నించారని, అడ్డువస్తే తనని తన కుటుంబాన్ని చంపేస్తానని బెదరించినట్లు బాధితుడు బండోజు శ్రీనివాస్ ఆదిభట్ల పోలీసుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైనా కూడా మళ్లీ కబ్జాకి యత్నించారని గత నెల 3న మరో ఫిర్యాదు చేశారు.
Kalvakuntla Kanna Rao Controversy :పోలీసుల వివరాల ప్రకారం.. ఓఎస్‌ఆర్ ప్రాజెక్ట్ సంస్థకు చెందిన ప్రతినిధులు ఆ భూమిలో కంటైనర్లో నివసిస్తున్న సమయంలో, కల్వకుంట్ల కన్నారావు, జక్కిడి సురేందర్, జక్కిడి హరినాథ్, శివ, డానియెల్ సహా మరికొందరు వారిని బెదిరించారని, జేసీబీతో భూమి కబ్జా చేయడానికి వచ్చారని తమకు ఫిర్యాదు చేశారన్నారు. వీరిపై మరో ఫిర్యాదు రావడంతో, మరో కేసు నమోదు చేసి, మొత్తం 25 మందిని నిందితులుగా చేర్చినట్లుగా తెలిపారు. వీరిలో కన్నారావు పాత్ర కీలకంగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.