KCR Meeting with BRS Leader on MP Candidates :భారత రాష్ట్ర సమితి తరపున చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్(Kasani Gyaneshwar) పేరు ఖరారైనట్లు సమాచారం. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్(KCR) సమావేశమయ్యారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీలు, నేతలు సమావేశంలో పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ, అభ్యర్థిత్వంపై సమావేశంలో చర్చ జరిగింది.
సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి (Ranjit Reddy) ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవడంతో ప్రత్యామ్నాయంగా పోటీ చేసే అభ్యర్థి విషయమై సమావేశంలో చర్చించారు. కాసాని జ్ఞానేశ్వర్ అభ్యర్థిత్వానికి నేతలు మొగ్గు చూపినట్లు సమాచారం. కొన్ని వ్యక్తిగత, ఇతర కారణాల రీత్యా రంజిత్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, ఆయన ఎక్కడకీ పోరని, పార్టీలోనే కొనసాగుతారని కేసీఆర్ నేతలకు వివరించినట్లు తెలిసింది.
మరోవైపు నల్గొండ జిల్లాలోని రెండు లోక్‌సభ నియోజకవర్గాల ఎన్నికల కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. లోక్‌సభ టికెట్ ఆశించి, ఆ తర్వాత వెనక్కి తగ్గిన గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukender Reddy) కుమారుడు అమిత్‌రెడ్డి భేటీకి హాజరుకాలేదు. ఆశావహ అభ్యర్థులపై బీఆర్ఎస్ అధినేత ఆరా తీశారు. అభ్యర్థులకు సంబంధించిన అన్ని విషయాలను మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి చెప్పినట్లు నేతలు పేర్కొనగా చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.