MLC Jeevan Reddy Letter to High Command : రాష్ట్ర కాంగ్రెస్‌లోని పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నాననే అసంతృప్తితో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హై కమాండ్‌కు లేఖ రాశారు. తీవ్ర మానసిక బాధతో లేఖ రాస్తున్నందుకు విచారిస్తున్నానని తెలిపారు. కొన్ని స్వార్థపూరిత శక్తులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి నెపంతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
పోచారం శ్రీనివాస్ రెడ్డి ఫిరాయింపులకు ముఠా నాయకుడిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీ ఫారంతో గెలిచిన వాళ్ల మాదిరి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు లేకుంటే ప్రభుత్వం నడవదా? అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుదారులు కాంగ్రెస్ ముసుగు వేసుకోవడం తనకు బాధ కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆధిపత్య పోరు కోసం తన అనుచరుడు గంగారెడ్డిని క్రూరంగా హత్య చేశారన్న జీవన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ పాత్ర ఉందని తాను ఎక్కడా మాట్లాడలేదని స్పష్టం చేశారు.
హత్యకు పాల్పడిన బత్తిన సంతోశ్ బలమైన బీఆర్ఎస్ కార్యకర్తగా మాత్రమే చెప్పానని వివరించారు. నిందితుడు సంతోశ్‌పై అనేక కేసులు ఉన్నాయని ఆరోపించిన జీవన్ రెడ్డి, ఎవరి అండదండలు చూసుకుని గంగారెడ్డిని హత్య చేశారని ప్రశ్నించారు. అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌లను కలిసి తన ఆవేదన చెబుతానని తెలిపారు. పార్టీ విధానానికి అనుగుణంగానే తన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.