Cinema War in AP Politics : సినిమా అంటే తెలియని వారుంటారా ?! సగటు ప్రేక్షకుడు తెరపై సన్నివేశాలు, సందర్భాలకు అనుగుణంగా ఊహల్లో తేలిపోతుంటాడు. కొన్ని సీన్లు నవ్విస్తాయి, కొన్ని సీన్లు కన్నీళ్లు తెప్పిస్తాయి. మరికొన్ని సీన్లు కదిలిస్తాయి. అసలు సినిమా అంటేనే మనిషిని కదిలించేది, కవ్వించేది. అందుకే ఇప్పుడు పాలకులు సైతం సినిమాను ఆయుధంగా వాడుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఏపీలోని జగన్ సర్కారు ఈ విషయంలో రెండు ఆకులు ఎక్కువే చదివింది.
వెండి తెర వెనక :తొలితరం సినిమాలు భక్తి రస ప్రాధాన్యంపై ఆధారపడి వచ్చాయి. ఆ తర్వాతి కాలంలో జీవన సౌందర్యాన్ని, జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలే నేపథ్యంగా తెరకెక్కాయి. మరో అడుగు ముందుకేస్తే ఫిక్షన్, ప్రేమ కథలు ఊపిరి పోసుకున్నాయి. వాటన్నింటికీ భిన్నంగా సామాజిక సమస్యలు, ప్రజా చైతన్యంపై వెండి తెరపై వచ్చిన సినిమాలు ప్రజలను కదిలించాయి. పెట్టుబడిదారులపై కార్మిక వర్గాల పోరాటం, అగ్రవర్ణాలపై అణగారిన ప్రజల ధిక్కార స్వరం, నియంతృత్వ ప్రభుత్వాలపై ప్రజా ఉద్యమాలు పునాదిగా తెరకెక్కి చైతన్యం రగిలించాయి. అలాంటివెన్నో ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి.
'రాజధాని ఫైల్స్' సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
ఈతరం చిత్రాల్లో అనేకం అవసరాలు, అవకాశాలను ఆశించి ప్రజల ముందుకొస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేలా తెరకెక్కుతున్నాయి. సగటు ఓటరు మస్తిష్కాన్ని దెబ్బతీస్తూ ఆలోచనలకు కళ్లెం వేస్తూ దారి మళ్లిస్తున్నాయి. మందు, డబ్బు పంచి ఓటర్లను మభ్యపెట్టడంలో రాణిస్తున్న రాజకీయ పార్టీలు సినిమాను సైతం ఆయుధంగా మలుచుకోవడంలో విజయవంతమయ్యాయి.
'రాజధాని ఫైల్స్' మూవీ రివ్యూ - ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే..?
తెరవెనక పక్కా'వ్యూహం'తో 'సిద్ధం' :ప్రజా సమస్యలు అనేకం. ఉద్యోగులు, రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఇలా అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి. హామీల ఉల్లంఘనకు పాల్పడిన వైఎస్సార్సీపీ జగన్ సర్కారు ఇప్పుడు జనానికి 'సినిమా' చూపిస్తోంది. సినిమా అనే పక్కా 'వ్యూహం'తో మరో సారి అధికారంలోకి వచ్చేందుకు సర్వం 'సిద్ధం' చేసుకుంటోంది. కల్పిత పాత్రలు, సన్నివేశాలతో విద్వేషాలు, వివాదాలు రెచ్చగొట్టడం, చర్చలు పెట్టించి ప్రజా సమస్యలను దారి మళ్లించడం లక్ష్యంగా పెట్టుకుని విజయవంతమవుతోంది. గతంలో యాత్ర సినిమా సక్సెస్ కావడంతో మరోసారి 'యాత్ర 2' తెర మీదకు తీసుకువచ్చింది జగన్ అండ్ కో. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతిష్టను దెబ్బతీసేలా రూపొందించిన 'వ్యూహం' చిత్రానికి కోర్టు బ్రేకులు వేయడం విదితమే.
రాజధాని ఫైల్స్ చిత్రానికి ఏ పార్టీతో సంబంధం లేదు: మూవీ యూనిట్
'రాజధాని ఫైల్స్' పై అధికార పార్టీ అభ్యంతరం :ఎన్నికల వేళ రాజధాని ఫైల్స్ అనే మరో సినిమా కూడా వివాదాస్పదమైంది. సినిమా విడుదలను నిలిపివేయాలంటూ అధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. చిత్రంలోని పాత్రలు సీఎం జగన్, ఎమ్మెల్యే కొడాలి నాని పోలి ఉన్నాయని అభ్యంతరం చెప్పారు. నిర్మాతల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ వ్యూహం సినిమాలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, సోనియా గాంధీ, రోశయ్య తదితర నేతల ప్రతిష్ట దెబ్బతినేలా సన్నివేశాలున్నాయని సీబీఎఫ్‌సీ పేర్కొందని ఉటంకించారు. రాజధాని ఫైల్స్ సినిమాలో ఎవరి ప్రతిష్టను దెబ్బతీసేలా, కించపరిచేలా సన్నివేశాలు లేవని తెలిపారు.
'రాజధాని ఫైల్స్' సినిమాను ఆపండి - హైకోర్టులో వైఎస్సార్సీపీ నేత పిటిషన్