Jagan meeting with YSRCP MLAs and MLCs: రేపటి నుంచి శాసన సభ సమావేశాలకు హాజరు కాకూడదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ నిర్ణయించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సైతం సభకు వెళ్లకుండా దూరంగా ఉండాలని జగన్ ఆదేశించారు. అసెంబ్లీకి వెళ్లకుండా ప్రెస్ మీట్లు పెట్టి సమస్యలను ప్రజలకు వివరిస్తానని తెలిపారు. శాసన సభను బాయ్‌కాట్ చేసి వెళ్లిన అనంతరం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ సమావేశమయ్యారు. వైఎస్సార్సీపీ కౌన్సిల్‌లో మంచి మెజార్టీ ఉంది కాబట్టి దీన్ని వినియోగించుకోవాలని జగన్ ఆదేశించారు. ఎమ్మెల్సీలంతా శాసన మండలికి వెళ్లి ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని నిర్దేశించారు.
ప్రతిపక్ష హోదా విషయంలో అధికార పార్టీ వైఖరిని ప్రజలకు తేటతెల్లం చేసేందుకే ఇవాళ అసెంబ్లీకి వెళ్లినట్లు తెలిపిన జగన్ ప్రతిపక్ష హోదా ఇస్తే హక్కుగా తనకు సమయం ఇవ్వాల్సి వస్తుందని అన్నారు. సభా నాయకుడికి దాదాపు సమాన స్థాయిలో సమయం ఇవ్వాల్సి ఉంటుందని నేతలతో జగన్ అన్నారు. అందుకనే ప్రతిపక్ష హోదాను ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని వివరించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. అన్యాయంగా ఇళ్లపట్టాలు రద్దు చేస్తున్నారని జగన్ దృష్టికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీసుకు రాగా ఎవరైనా ఇళ్లు కట్టుకోకపోతే ప్రభుత్వం వారికి ఇళ్లు మంజూరు చేసి ఇవ్వాలని, అంతేగాని పేదలపై కక్ష కట్టి పట్టాలు రద్దుచేయడం ఏంటని ప్రశ్నించారు. పట్టాలు రద్దు చేస్తే తప్పకుండా కోర్టును ఆశ్రయిస్తామని జగన్ స్పష్టం చేశారు.