Jagan Sharmila Family Disputes :"అందరికీ అన్నీ చేశాం. అక్కా చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియదు. అవ్వాతాతల ఆప్యాయత ఏమైందో తెలియడం లేదు. అక్కాచెల్లెళ్ల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియదు" అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై మాట్లాడుతూ జగన్ చేసిన వ్యాఖ్యలివి. తాజాగా ఆయన తన చెల్లి షర్మిలపై ప్రేమ లేదని, బహుమతిగా ఇవ్వాలనుకున్న ఆస్తి ఇవ్వలేమంటూ కోర్టుకెక్కారు.
"ప్రేమాభిమానాలతో కొన్ని ఆస్తులు ఇవ్వాలనుకున్నాం. కానీ, ఇప్పుడు ప్రేమ లేదు. ఆస్తులు ఇవ్వాలనుకోవడం లేదు" అంటూ ఆస్తి వివాదంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ కోర్టుకెక్కారు.
వైఎస్సార్సీపీ అధినేత జగన్.. ఆస్తుల వివాదంలో తల్లి, చెల్లిపై కోర్టుకెక్కారు. సరస్వతీ పవర్ కంపెనీలోని తమ షేర్లను షర్మిల, విజయమ్మ అక్రమంగా బదిలీ చేసుకున్నారని జగన్, భారతీ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ కు ఫిర్యాదు చేశారు. సోదరిపై ప్రేమాభిమానాలతో షేర్లు ఇవ్వాలనుకున్నప్పటికీ షర్మిల రాజకీయ ప్రోద్భలంతో నిర్ధాక్షిణ్యంగా తనపై వ్యక్తిగతంగా బురద చల్లినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. రాజకీయంగా వ్యతిరేకించడంతో పాటు తప్పుడు ప్రచారంతో తనకు చెడ్డపేరు తెచ్చినందున ఇక ప్రేమ లేదని, అందుకే షేర్లు ఇవ్వొద్దని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే కంపెనీ చట్టానికి విరుద్ధంగా జులైలో విజయమ్మ పేరిట షేర్లు బదిలీ చేసుకున్నారని వాటిని రద్దు చేయాలని కోరారు. జగన్, భారతీ పిటిషన్ పై వివరణ ఇవ్వాలని షర్మిల, విజయమ్మకు ట్రైబ్యునల్ నోటీసులు ఇచ్చింది.
వైఎస్ వారసులు ఎవరు? - తేల్చేసిన విజయమ్మ - Vijayamma Support Sharmila
ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
సరస్వతి పవర్ కంపెనీలోని తన షేర్లతో పాటు భారతి, క్లాసిక్ రియాల్టీ షేర్లను అక్రమంగా బదిలీ చేసుకున్నారని జగన్ పిటిషన్ వేశారు. గ్రంథి ఈశ్వర్ రావు, గ్రంథి శశికళ 1999 మార్చి 31న స్థాపించిన సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో జగన్ 74,26,294 షేర్లు, భారతి 40,50,000, క్లాసిక్ రియాల్టీ సంస్థ 12 లక్షల షేర్లు కొనుగోలు చేసినట్లు పిటిషన్ లో వెల్లడించారు. తద్వారా కంపెనీలోని 51.01 శాతం వాటా జగన్, భారతీ, క్లాసిక్ రియాల్టీకి వర్తిస్తాయని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తాను సంపాదించిన ఆస్తులతో పాటు వారసత్వంగా వచ్చినవన్నీ జగన్, షర్మిలకు సమానంగా పంచారని తెలిపారు.
జగన్ స్వయంగా కొన్ని వ్యాపారాలు చేసి తన సోదరిపై ప్రేమాభిమానంతో కొన్ని ఆస్తులు ఇవ్వాలని భావించినట్లు పేర్కొన్నారు. ఆ ఉద్దేశంతో సరస్వతీ పవర్ కంపెనీలో జగన్, భారతీ, వారి కంపెనీల పేరిట ఉన్న షేర్లను భవిష్యత్తులో బదిలీ చేస్తామని 2019 ఆగస్టు 31న ఎంవోయూ చేసుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత సరస్వతీ పవర్లో జగన్‌కు చెందిన సండూర్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఉన్న మొత్తం షేర్లు, భారతీ డైరెక్టర్‌గా ఉన్న క్లాసిక్ రియాల్టీకి చెందిన వాటాలు కలిపి మొత్తం కోటి 21 లక్షల 74 వేల 207 షేర్లను 2021 జూన్ 2న విజయమ్మకు బదిలీ చేసినట్లు తెలిపారు. షర్మిల తరఫున విజయమ్మ తనపై షేర్లు పెట్టుకున్నారని తెలిపారు. ఈడీ, సీబీఈ కేసులు, కోర్టు వివాదాలు తేలిన తర్వాత మిగతావి బదిలీ చేయాలకున్నట్లు తెలిపారు.
గొడ్డలితో అందర్నీ నరికేయండి, అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్- భారతిపై వైఎస్ షర్మిల ఆగ్రహం - YS Sharmila Comments on Avinash
షర్మిల కృతజ్ఞత లేకుండా జగన్ కు తీవ్రంగా బాధ పెట్టేలా వ్యవహరించారని పిటిషన్లో పేర్కొన్నారు. రాజకీయంగా వ్యతిరేకించడంతో పాటు అబద్ధాలు, తప్పుడు ప్రచారంతో జగన్ కు వ్యక్తిగతంగా చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించారని తెలిపారు. దానివల్ల అన్నా చెల్లెళ్ల మధ్య సంబంధాలు సన్నగిల్లి ముఖ్యంగా రాజకీయ ప్రోద్భలంతో నిర్ధాక్షిణ్యంగా బురద చల్లడంతో సోదరిపై జగన్‌కు ప్రేమ పూర్తిగా పోయిందని పిటిషన్లో వెల్లడించారు. దాంతో షర్మిలకు ఇవ్వాలనుకున్న షేర్లకు సంబంధించి ఎంవోయూ, గిఫ్ట్ డీడ్ అమలు చేయకూడదని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
అయితే బోర్డు తీర్మానం మేరకు జులై 6న జగన్, భారతీ వాటాలన్నీ విజయమ్మకు బదిలీ చేసినట్లు వార్షిక రిటర్న్స్ లో సరస్వతీ పవర్ కంపెనీ వెల్లడించడంతో జగన్, భారతీ షాక్‌కు గురైనట్లు పేర్కొన్నారు. భారతీకి చెందిన 62 వేల 126 ఆస్తులు కంపెనీ డైరెక్టర్ జనార్దన్ రెడ్డి పేరిట బదిలీ అయ్యాయని తెలిపారు. తాము షేర్ల బదిలీ ఫారాలు, ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు ఇతర డాక్యుమెంట్లు ఇవ్వకుండానే తమ సంతకాలు కూడా లేకుండా ప్రక్రియ పూర్తి చేయడం కంపెనీ చట్టానికి విరుద్ధమని తెలిపారు. ఈడీ, సీబీఐ, కోర్టు వివాదాలు తేలిన తర్వాతే బదిలీ చేయనున్నట్లు ఎంవోయూ, గిఫ్ట్ డీడ్‌లో షరతుకు కూడా విరుద్ధమన్నారు.
షేర్ల బదిలీ అక్రమంటూ ఆగస్టు 21న కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లకు లేఖ రాసినట్లు తెలిపారు. జులై రెండో, మూడో వారాల్లో షర్మిలతో జగన్, భారతీ పలుమార్లు చర్చలు జరిపినట్లు తెలిపారు. చట్టవిరుద్ధంగా జరిగిన షేర్ల బదిలీని రద్దు చేసి జగన్, భారతీ, క్లాసిక్ రియాల్టీ పేరిట 51.01 శాతం కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని ఎన్సీఎల్టీని కోరారు. జగన్, భారతీ పిటిషన్లపై విచారణ జరిపిన ఎన్సీఎల్టీ షర్మిల, విజయమ్మకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణ నవంబరు 8కి వాయిదా వేసింది.
చెల్లి వ్యక్తిత్వాన్ని హననం చేయించిన అన్నగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు: షర్మిల - YS Sharmila Allegations on Jagan