Irrigation Union Elections in AP: రాష్ట్రంలో సుదీర్ఘ విరామం తర్వాత నిర్వహించిన సాగునీటి సంఘాల ఎన్నికలు పలుచోట్ల వాగ్వాదాలకు దారి తీశాయి. కొన్నిచోట్ల ఎన్నికలు ఏకగ్రీవం కాగా మరికొన్నిచోట్ల చెదురుమదురు ఘటనలతో వాయిదా పడ్డాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 4 సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. మైలవరం మండలం గణపవరంలో ఎన్నికల సమాచారం లేదంటూ టీడీపీలోని ఓ వర్గం ఓటింగ్ ప్రక్రియను అడ్డుకుంది. ఎన్నికను వాయిదా వేసిన అధికారులు తదుపరి ప్రక్రియను త్వరలో ప్రకటిస్తామన్నారు.
కృష్ణా జిల్లా పెందూరులో జనసేనలో ఇరు వర్గాలు నామినేషన్లు వేయటం వివాదాస్పదమైంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాల్ని సముదాయించారు. కృష్ణా జిల్లా పెదముత్తేవి సాగునీటి సంఘం అధ్యక్షుడిగా టీడీపీ బలపర్చిన చంద్రశేఖరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ జిల్లా గుండ్లకుంట సాగునీటి సంఘం ఎన్నికల్లో వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వీడియో తీస్తున్న మీడియా సిబ్బందిపైనా వైఎస్సార్సీపీ నాయకుడు దుర్భాషలకు దిగారు. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు.
వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే హంగామా: కర్నూలు జిల్లా పార్లపల్లెలో సాగునీటి సంఘం ఎన్నికలకు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గడువు ముగిసిన తర్వాత నామినేషన్ వేస్తానంటూ హడావుడి చేశారు. పోలీసులు అడ్డుకోగా చెన్నకేశవరెడ్డి కాసేపు అక్కడేకూర్చుని హంగామా సృష్టించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలోని సాగునీటి నీటిసంఘం ఎన్నికల్లో ఎక్కువ చోట్ల కూటమి అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఆరుగురు ఏకగ్రీవమయ్యారు. నెల్లూరు జిల్లా పెద్దఅబ్బిపురంలో అధికారులు నామినేషన్ తిరస్కరించారంటూ జనసేన నాయకులు ఆందోళనకు దిగడం స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది.
గుడ్ న్యూస్ : వ్యవసాయ వ్యర్థాలతో విద్యుదుత్పత్తి - పెరగనున్న రైతుల ఆదాయం