CM Chandrababu Review on TDP Membership Registration: పనితీరు ఆధారంగానే గుర్తింపు, పదవులు తప్ప ఊరికే పార్టీలో ఉన్నామంటే కుదరదని టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలకు, పార్టీకి సేవ చేయకుండా 30-40 ఏళ్ల నుంచి పార్టీలో ఉన్నామని పదవులు ఇమ్మనటం సరికాదని అన్నారు. కొందరు ఎమ్మెల్యేలు అయిపోయామనో, పదవులు వచ్చేశాయనో పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ వల్లే మంత్రైనా, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులనే విషయం గ్రహించి ప్రవర్తించాలని తేల్చిచెప్పారు. పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు సేవ చేస్తేనే రాజకీయాల్లో కొనసాగుతారని వెల్లడించారు. ఈ క్రమంలో పార్టీ ముఖ్య నేతలతో సీఎం సమావేశం నిర్వహించారు.
సభ్యత్వ నమోదులో సరికొత్త రికార్డు: సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అక్టోబర్ 26న సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాగా నేటికి ఆ సంఖ్య 73 లక్షలకు చేరింది. సభ్యత్వాల నమోదుపై పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సభ్యత్వ నమోదు అంశాలను నేతలు చంద్రబాబుకు వివరించారు. నేటికి దాదాపు 73 లక్షల మంది సభ్యత్వం తీసుకోగా ఇందులో 85 వేల మంది తెలంగాణ నుంచి పొందారని తెలిపారు. సభ్యత్వ నమోదులో టాప్ 5లో రాజంపేట, నెల్లూరు, కుప్పం, పాలకొల్లు, మంగళగిరి నియోజకవర్గాలు ఉన్నాయని నేతలు సీఎంకు చెప్పారు.
మీ డ్రామాలు ఆపండి - 2029లోనే జమిలి ఎన్నికలు: సీఎం చంద్రబాబు
సంక్షేమంతో పాటు రాజకీయంగా, ఆర్థికంగా ఎంపవర్: సభ్యత్వ కార్యక్రమంపై సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యత్వ కార్యక్రమంతో పార్టీకి బలమైన కార్యకర్తల ఆర్మీని తయారు చేస్తామని సీఎం అన్నారు. ప్రతి నలుగురిలో ఒకరు తెలుగుదేశం సభ్యత్వం పొందే పరిస్థితి రావాలని అన్నారు. తెలుగుదేశం కార్యకర్తలకు సంక్షేమం అందించడంతో పాటు రాజకీయంగా, ఆర్థికంగా ఎంపవర్ చేసే కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు. స్కిల్ డెవలప్మెంట్, అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు ప్రాధాన్యత క్రమంలో అందించడం ద్వారా ఆర్థికంగా వాళ్లు నిలదొక్కుకునే కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందని సీఎం అన్నారు.
కేవలం వెల్పేర్ మాత్రమే కాకుండా కార్యకర్తల తలసరి ఆదాయం పెంపునకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. దీనిపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కష్టపడి పని చేసిన వారికి మెరిట్ పద్దతిలో పదవులు ఇవ్వడంతో పాటు ఆయా కుటుంబాలను ఆర్థికంగా నిలబెట్టే కార్యక్రమం పార్టీలో అన్ని స్ధాయిలో జరుగుతుందన్నారు.
మంత్రులకు పలు బాధ్యతలు అప్పగింత: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా నీరు-చెట్టు, నరేగా బిల్లులను నిలిపివేసిందని, ఇప్పటికే కొంత మేర బిల్లులు ఇచ్చామని మిగిలిన మొత్తం కూడా త్వరలో చెల్లిస్తామని సీఎం చెప్పారు. నాడు-నేడు పనులు చేసి బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నవారి సమస్యల పరిష్కారాన్ని ముగ్గురు మంత్రులకు అప్పగిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు ఈ అంశంపై ఎప్పటికప్పుడు చర్చించి ప్రభుత్వం నుంచి నిబంధల ప్రకారం బిల్లులు మంజూరు అయ్యేలా చూసే బాధ్యతను సీఎం చంద్రబాబు అప్పగించారు.
దగా చేసి నిరసనలు చేస్తారా? - వైఎస్సార్సీపీ నేతలకు టీడీపీ ఐదు ప్రశ్నలు
జగన్ అక్రమాస్తుల కేసులపై CBI, ED నివేదిక - విచారణ జనవరి 10కి వాయిదా వేసిన SC