YSRCP LEADERS RESIGN : జగన్‌పై ఆపార్టీ నేతలు పెట్టుకున్న భ్రమలు క్రమంగా తొలగిపోతున్నాయి. ఆయన తీరేంటో తెలిసొస్తోంది. ఇంకా వైఎస్సార్సీపీలో ఉంటే జనంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయనే భయంతో నేతలు ఆ పార్టీకి దూరం జరుగుతున్నారు. గ్రామ స్థాయి నాయకులు మొదలు కీలక నేతల వరకు రాజీనామాల లేఖాస్త్రాలు సంధిస్తూ తాడేపల్లి ప్యాలెస్‌తో తమకున్న బంధాన్ని తెంచుకుంటున్నారు. ఎన్నికల ముందే కీలక నేతలు జగన్‌కు గుడ్ బై చెప్పగా, ఆపైనా వలసలు ఆగడం లేదు. ఈ పరిణామాలు జగన్ సహా ఆ పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి.
వై నాట్ 175 అంటూ మేకపోతు గాంభీర్యాలు పోయిన జగన్‌కు ఎన్నికల ఫలితాలు దిమ్మ తిరిగేలా చేశాయి. దీంతో పార్టీ నేతలు, శ్రేణులు జగన్‌తో బంధం తెంచుకుంటున్నారు. వాస్తవానికి ఎన్నికల ముందే పరువురు ఎంపీలు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జగన్ తీరు నచ్చక బయటకు వచ్చేశారు. ఎంపీలు వల్లభనేని బాలశౌరి, శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రఘురామకృష్ణంరాజు లాంటి కీలక నేతలు పార్టీ వీడారు. ఆత్మగౌరవాన్ని చంపుకోలేమంటూ ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సంజీవ్ కుమార్ సహా జగన్‌తో తొలి నుంచీ నడిచిన కాపు రామచంద్రరెడ్డి, కొలుసు పార్థసారధి, గుమ్మనూరు జయరాం సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు బయటపడ్డారు.
జరిగిన అవమానాలను చెప్పుకుంటూ: కొందరు పోటీ చేయకుండా ఉండిపోయారు. పోటీ చేసిన వారిని ప్రజలు ఘోరంగా ఓడించడంతో ఇప్పుడు భవిష్యత్‌ను కాపాడుకునే పనిలోపడ్డారు. ఎన్నికలైన 6 నెలల్లోనే కీలక నేతలు వైఎస్సార్సీపీని వీడారు. ఈ జాబితా మరింత పెరిగే సూచనలతో ఆ పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. వలసలను ఆపేందుకు జగన్ సహా ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బుజ్జగిస్తున్నా అవేమీ ఫలితాలనివ్వడం లేదు. నేతలు రాజీనామాస్త్రాలను సంధిస్తూ పార్టీలో తమకు జరిగిన అవమానాలను చెప్పుకుంటూ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తున్నారు.
'ప్రజాతీర్పును జగన్ గౌరవించకపోతే ఎలా?' - వైఎస్సార్సీపీకి మరో ఇద్దరు గుడ్ బై
మరో ముగ్గురు సభ్యులు కూడా రెడీ: ఎన్నికల్లో పరాభవం తర్వాత జగన్‌కు ఇప్పుడు పార్టీ నేతలను తనతో ఉండేలా చూసుకోవడం తలకు మించిన భారంగా మారింది. రాజ్య సభలో మొత్తం 11 స్థానాలను కైవసం చేసుకున్న వైఎస్సార్సీపీకి ఎన్నికలు ముగిసిన 6 నెలల్లోనే రివర్స్ అడుగులు పడుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత 100 రోజుల్లోనే జగన్ పార్టీ రాజ్యసభలో 3 స్థానాలను కోల్పోయింది. ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య పదవులకు రాజీనామా చేశారు. తొలి నుంచి జగన్ కు అండగా ఉన్న మోపిదేవి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీద మస్తాన్ రావుకూ పార్టీలో ప్రాధాన్యత తగ్గించడంతో మనస్తాపానికి లోనై రాజీనామా చేశారు. ఇప్పటికే ముగ్గురు ఎంపీలు పార్టీని వీడగా, మరొకరు త్వరలో రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగం నుంచి వచ్చిన మరో ముగ్గురు సభ్యులు కూడా పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.
ఎన్నికల ముందు ఏదో ఊహించుకుని టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరి విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఘోరంగా ఓడిన కేశినేని నానికి ఎన్నికలు ముగిసిన మరుక్షణం తత్వం బోధపడింది. ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పి వ్యాపారాలు చేసుకుంటున్నారు. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి బయటపడ్డారు. ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు వైఎస్సార్సీపీని వీడారు. ఏలూరుకు చెందిన మాజీ మంత్రి ఆళ్ల నాని జగన్‌కు బైబై చెప్పారు. ప్రకాశం జిల్లాలో కీలక నేత, జగన్ బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్సార్సీపీని వీడి జనసేనలో చేరారు.
జగ్గయ్య పేట ఎమ్మెల్యేగా చేసిన సామినేని ఉదయభాను, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేనలో చేరారు. వైఎస్సార్సీపీలో తనను ఘోరంగా అవమానించారంటూ కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జగన్ తో దోస్తీ తెంచుకున్నారు. మాజీ ఎమ్మెల్యే లు మద్దాలి గిరిధర్, రాపాక వరప్రసాద్, ఏలూరు జిల్లా కైకలూరుకు చెందిన జయమంగళ వెంకటరమణ పార్టీకి గుడ్‌బై చెప్పారు. సినీనటుడు అలీ, వాసిరెడ్డి పద్మ సైతం టాటా చెప్పేశారు. తాజాగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ సహా 2014 ఎన్నికల్లో భీమవరంలో పవన్ కళ్యాణ్ పై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన గ్రంథి శ్రీనివాస్ సైతం వైఎస్సార్సీపీకి రాంరాం చెబుతున్నట్లు ప్రకటించారు.
'జగన్‌కు బాధ్యత లేదు - గుడ్ బుక్ కాదు గుండె బుక్ ఉండాలి' - వైఎస్సార్సీపీకి రాజీనామా
ఎప్పుడు ఎవరు ఝలక్ ఇస్తారో తెలియక : శాసనసభకు ఎన్నికైన 11 మంది ఎమ్మెల్యేల్లో చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. సభలో అడుగు పెట్టాలని ఎన్నో ఏళ్లుగా కలలు కన్న నేతలకు ఆ అదృష్టాన్ని, అవకాశాన్ని జగన్ ఇవ్వకపోవడంపై వారు మథన పడుతున్నారు. మండలిలో వైఎస్సార్సీపీకి మెజార్టీ ఉన్నా ప్రజా సమస్యలపై పోరాడడంలో జగన్ వైఫల్యం చెందారని ఎమ్మెల్సీలు సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీపీకి చెందిన మహ్మద్ ఇక్బాల్, జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీ పదవులకు గతంలోనే రాజీనామా చేశారు. ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి , పోతుల సునీత కూడా అదే బాటలో పయనించారు. ఎప్పుడు ఎవరు ఝలక్ ఇస్తారో తెలియక జగన్ సతమతమవుతున్నారు. జిల్లాల్లో స్థానిక సంస్థల్లో గెలిచిన పలువురు కీలక ప్రజా ప్రతినిధులు సైతం వైఎస్సార్సీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే విశాఖ జిల్లాలో షాక్ తగిలింది. భీమిలి జడ్పీటీసీ సభ్యుడు సహా పలువురు నేతలు మూకుమ్మడి రాజీనామా చేశారు. హిందూపురం మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇంద్రజ వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరారు. వైఎస్సార్సీపీ వ్యాపార సంస్థలా మారిందంటూ బ్రాహ్మణ కో ఆపరేటివ్ సొసైటీ ఛైర్మన్ రామకృష్ణప్రసాద్ జగన్ తో బంధం తెంచుకున్నారు. హిందూపురం, మాచర్ల సహా పలువురు జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు తమ దారి తాము చూసుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కాకముందే జగన్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునివ్వవడం, జిల్లాల పర్యటనలకు వెళ్లేందుకు సిద్ధపడడానికి ప్రధాన కారణం వలసల ఒత్తిడి, ఆందోళనే కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సొంత పార్టీ వారే కేసులు పెట్టి వేధించారు - వైఎస్సార్సీపీకి మరో ఎమ్మెల్సీ రాజీనామా