Minister Nimmala on Irrigation Projects Schedule:పోలవరం ప్రాజెక్ట్ పనులపై షెడ్యూల్ విడుదల చేయాలని నిర్ణయించినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్, హంద్రినీవతో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులు, వాటర్ పాలసీలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ నెల రెండో వారంలో పోలవరం ప్రాజెక్ట్ను సందర్శించి, అక్కడే షెడ్యూల్ విడుదల చేసేలా సన్నాహాలు చేయాలని సీఎం సూచించారని వివరించారు. షెడ్యూల్ ప్రకారం ఒక్క రోజు కూడా తేడా లేకుండా పనులు జరగాలని సీఎం ఆదేశించారని నిమ్మల అన్నారు. ఐదేళ్ల విధ్వంస పాలన నుంచి తిరిగి పోలవరం పనులను పునఃప్రారంభిస్తున్నామని మంత్రి వివరించారు.
ఒక్క క్షణం కూడా వృథా కాకుండా పోలవరం పనులు చేపట్టాలని సీఎం సూచించారని మంత్రి తెలిపారు. జనవరిలో డయాఫ్రమ్ వాల్ పనులు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. పోలవరం పునరావాస పనులు కూడా త్వరలోనే చేపడతామని తెలిపారు. ఆర్ అండ్ ఆర్ కాలనీల నిర్మాణం, భూసేకరణ తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. అంతర్రాష్ట్ర సమస్యలను పరిష్కరించి, పోలవరం సకాలంలో పూర్తి చేస్తామని తేల్చిచెప్పారు. గోదావరి జలాలు ఉత్తరాంధ్ర, రాయలసీమకు తీసుకెళ్తామని మంత్రి నిమ్మల వెల్లడించారు. రాయలసీమ సాగు, తాగు నీరు అందించేందుకు హంద్రీనీవ కాలువ సామర్థ్యం పెంచేలా లైనింగ్, వైండనింగ్ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.
ప్రతి ఎకరాకు నీరందించడమే లక్ష్యం: నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీరందించే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని గత ప్రభుత్వం విధ్వంసం చేసిందని మంత్రి మండిపడ్డారు. అత్యంత వెనుకబడిన ప్రకాశం జిల్లాకు జీవనాడి వెలిగొండ ప్రాజెక్ట్ అని, చంద్రబాబు లాంటి వ్యక్తి పని చేస్తే వెలిగొండ పూర్తవ్వడానికి ఇంకా రెండేళ్లు పడుతుందని అన్నారు. అదే జగన్ గానీ, అంబటి రాంబాబు గానీ ఉంటే ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని ఎద్దేవా చేశారు.