బలహీన వర్గాలు రాజకీయంగా ఎదగకుండా - జగన్ బంతాటలో బలవుతున్న నేతలు Injustice to Dalit Leaders YSRCP: నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ. ఇదీ ప్రతి ప్రసంగానికి ముందు సీఎం జగన్ పలికే పలుకులు. వారిని ఆయనే ఉద్ధరించినట్లు పదేపదే చెబుతుంటారు. తన హయాంలోనే సామాజిక న్యాయం జరిగిందంటూ ఊదరకొడుతుంటారు. కానీ ఆయన పార్టీలోనే ఎమ్మెల్యేలే ఇదంతా పూర్తి అవాస్తవమంటున్నారు.
దళిత ఎమ్మెల్యేలు ఆదిమూలం, ఎమ్‌ఎస్ బాబు తమ ఆవేదనని చెప్పుకొచ్చారు. వీరే కాదు రాబోయే ఎన్నికలు పెత్తందార్లకు, పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధమని సీఎం చెబుతున్నారని, పేదల తరఫున పోరాడుతున్న తనను వదిలేసి పెత్తందారీ ఎంపీ వర్గం వైపే మొగ్గుచూపారని ఎమ్మెల్యే ఎలీజా ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌దీ ఇలాంటి పరిస్థితే.
బీసీలు, మైనార్టీల పరిస్థితి కూడా ఇంతకంటే గొప్పగా ఏం లేదు అధికార వైసీపీలో. బీసీలకు ఏపాటి న్యాయం చేశారో ఇటీవలే వైసీపీకు రాజీనామా చేసిన కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్, సీటు కోసం అధిష్ఠానంతో పోరాడుతున్న ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి లాంటివారు చెప్పారు.
ఎమ్మెల్యే టికెట్ రాకుండా కుట్ర చేసింది పెద్దిరెడ్డే: వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం
ఇప్పటివరకూ విడుదల చేసిన నాలుగు జాబితాల్లో కలిపి 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పుచేర్పులు చేశారు. ఇందులో ఎస్సీ-20, ఎస్టీ-3, బీసీ-15, ముస్లింలు-2 కలిపి 40 స్థానాలున్నాయి. అంటే దాదాపు 70 శాతం మార్పులు ఇవే. వీరంతా సమర్థులు కారని, జనంలో వీరికి బలం లేదని జగన్ తేల్చేశారా? అదే వైసీపీలో, ప్రభుత్వంలో అగ్రతాంబూలం అందుకుంటున్న ఒక ప్రధాన సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలంతా సమర్థంగా పనిచేస్తున్నారా అని వైసీపీలో బడుగు బలహీనవర్గాల నేతలే ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాధాన్య వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆరు నియోజకవర్గాల్లో మార్పులు చేశారు.
అందులో రెండు స్థానాలను సిటింగ్ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిల కుమారులకే కట్టబెట్టారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి ఆ నియోజకవర్గం పెత్తనం అప్పగించారు. ఆయన కుమారుడికి ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. తర్వాత కూడా చెన్నకేశవరెడ్డి సూచించిన బీసీ నేతకే అక్కడ టికెట్ ఇచ్చారు. మంగళగిరి, కదిరి, రాజంపేట ఈ మూడుచోట్ల ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నాయం చూపలేదు. మంగళగిరి ఎమ్మెల్యే ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిపోయారు.
అనంతలో 'పెద్ద'ల బంతాట - బలవుతున్న బలహీన వర్గాల నేతలు
ఇప్పటి వరకూ 10 లోక్‌సభ స్థానాల్లో కొత్త సమన్వయకర్తలను ప్రకటించారు. విజయవాడ, శ్రీకాకుళంలో ఎవరూ లేకపోవడంతో కొత్తవారిని నియమించారు. మిగిలిన ఎనిమిది చోట్ల మార్పులు చేశారు. ఏలూరు ఎంపీ శ్రీధర్ ఈసారి పోటీ చేయనని ప్రకటించారు. విశాఖ ఎంపీ సత్యనారాయణ అసెంబ్లీకి మారారు. మిగిలిన 6 స్థానాల్లో మూడు బీసీలు, రెండు ఎస్సీ, ఒకటి ఎస్టీలకు చెందినవే.
బీసీ వర్గానికి చెందిన ఎంపీల్లో గోరంట్ల మాధవ్, డాక్టర్ సంజీవ్‌కుమార్‌లను పూర్తిగా పక్కనపెట్టేశారు. తలారి రంగయ్యను ఆయన సామాజికవర్గం ఓట్ల దృష్ట్యా కళ్యాణదుర్గం అసెంబ్లీకి మార్చారు. ఎస్సీలలో గురుమూర్తిని సత్యవేడు అసెంబ్లీకి, రెడ్డప్పను గంగాధర నెల్లూరు అసెంబ్లీకి మార్చారు. వారిద్దరూ కొత్త చోట్ల ఇబ్బంది పడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేల వ్యతిరేకత వల్ల వారిని కొనసాగిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
Upper Caste Domination in AP నా ఎస్సీలు అంటూనే.. జీరోలను చేశారు! ఇదేనా సామాజిక విప్లవం..?