solar power supply contracts : సౌర విద్యుత్ సరఫరా (త్రైపాక్షిక) ఒప్పందాన్ని ఆమోదించాలంటూ విద్యుత్ పంపిణీ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌పై (పిటిషన్ విచారణార్హతతోపాటు) సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపి నిర్ణయాన్ని వెల్లడించాలని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలిని (ఏపీఈఆర్‌సీ) హైకోర్టు ఆదేశించింది. చట్ట నిబంధనలను పాటించాలని, పబ్లిక్ నోటీసు జారీ, తదితర ప్రక్రియను అనుసరించాలని ఏపీఈఆర్‌సీకి స్పష్టం చేసింది. ఈఆర్‌సీ నిర్ణయం అనంతరం ప్రస్తుత వ్యాజ్యాలపై విచారణ జరుపుతామని పేర్కొంటూ ఏప్రిల్ 18కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ ఆర్.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈమేరకు ఉత్తర్వులిచ్చింది.
విద్యుత్ వినియోగదారులపై బాంబు..వైసీపీ పాలనలో ప్రజలపై రూ.వేల కోట్ల విద్యుత్ భారం
సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(సెకి) నుంచి యూనిట్ ధర రూ.2.49 చొప్పున 7వేల మెగా వాట్ల సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్‌సీ) నిర్ధారించడాన్ని సవాలు చేస్తూ టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్, సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ హైకోర్టులో వేర్వేరుగా పిల్స్ దాఖలు చేశారు. సౌర విద్యుత్ తాత్కాలికంగా సమకూర్చుకునేందుకు ఏపీఈఆర్‌సీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. రిక్వెస్ట్ ఫర్ సెలక్షన్-ఆర్‌ఎఫ్‌ఎస్ కేంద్ర విద్యుత్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉందన్నారు. సెకి నుంచి సౌర విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించడాన్ని చట్ట విరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరారు. నిన్న జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు.
విద్యుత్ బిల్లులు షాక్ కొట్టకుండా చూస్తున్నాం: జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి