Harishrao on Telangana Medical Seats :రాష్ట్రం అవతరించి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి స్థానికత అంశంపై స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. అలాగే మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లు 100 శాతం తెలంగాణ విద్యార్థులకు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
జూన్ మూడో వారంలో అడ్మిషన్లు ప్రక్రియ మొదలవుతున్న క్రమంలో ప్రభుత్వం తక్షణం స్పందించి స్పష్టత ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేయాలని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. లేదంటే వైద్య విద్య చదివే అవకాశాలను తెలంగాణ విద్యార్థులు కోల్పోతారని ఆందోళన చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందున్న 20 మెడికల్ కాలేజీల్లోని 2,850 సీట్లలో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద 1,900 సీట్లు ఉన్నాయని తెలిపారు. ఇందులో 15 శాతం అన్ రిజర్వుడ్ కోటా అంటే 280 సీట్లు తెలంగాణ విద్యార్థులు నష్టపోతారని చెప్పారు.
తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలు కాపాడడంలో ప్రభుత్వం విఫలం : దీంతో పాటు నిమ్స్ సహా ఇతర మెడికల్ కాలేజీల్లోని దాదాపు 150 పీజీ సీట్లు కోల్పోతారని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. ఎంబీబీఎస్, పీజీ అడ్మిషన్ల ప్రక్రియ సమీపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముఖ్యమైన విషయాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటం దురదృష్టకరమని చెప్పారు. తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలు కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందుతోందని అన్నారు. ప్రభుత్వ తీరుతో తల్లిదండ్రులు, విద్యార్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని వెల్లడించారు.