Harish Rao Fires On Congress : తెలంగాణ ఆవిర్భావ సంబురాలను బీఆర్ఎస్ పార్టీ ఘనంగా జరిపితే పాకిస్థాన్ వేడుకలతో పోల్చడం కుసంస్కారానికి, అవగాహన రాహిత్యానికి నిదర్శనమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. 'ఎక్స్' వేదికగా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వారికి, ఈ గడ్డ మీద ప్రేమ ఉన్నవారికి రాష్ట్ర అవతరణ ప్రాముఖ్యత అర్థమవుతుందని అన్నారు.
ఉద్యమంలో ఏనాడూ పాల్గొనని వారికి, నోటి నుంచి ఒక్కసారి కూడా 'జైతెలంగాణ' అని నినదించని వారికి, అమరులకు ఏనాడూ నివాళులర్పించని వారికి ఆ ఆర్తి, ఆ భావోద్వేగం ఎలా అర్థమవుతుందని హరీశ్ రావు ప్రశ్నించారు. ఒక్క రోజు ముందుగా జరపడం కాదు, ఏడాది పొడువునా పండుగగా దశాబ్ది ఉత్సవాలను నిర్వహించేలా తమ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని ఆయన గుర్తు చేశారు.
Harish Rao On TG Decade Celebrations :2023 జూన్ 2వ తేదీ నుంచి 21 రోజులపాటు జరిపిన ఉత్సవాల్లో ఆటపాటలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, సంగీత విభావరి, సినిమా, జానపద కళాకారులతో ప్రదర్శనలు, సంగీత, నృత్యం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. జూన్ రెండో తేదీన జెండా ఆవిష్కరణతో దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమై, జూన్ 22న అమరుల సంస్మరణతో ముగించామని తెలిపారు. స్వతంత్ర పోరాటాన్ని చూడని నవతరం, తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని చూసిందని, ప్రత్యక్షంగా పాల్గొందని వెల్లడించారు.