Harish Rao Open Letter to CM Revanth :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సిద్ధిపేట ఎమ్మెల్యే హారీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. బ్యాంకుల నుంచి నోటీసులు, ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న రైతులకు తక్షణం రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని లేఖలో పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.
Hareesh Rao On Congress : "బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.లక్ష రూపాయల రుణమాఫీ(Loan Waiver) పొందిన రైతులు కూడా మళ్లీ బ్యాంకులకు వెళ్లి రూ.2 లక్షల రుణాలు(Loans) తీసుకోవాలని మీరే స్వయంగా పిలుపునిచ్చారని లేఖలో ప్రస్తావించారు. రేవంత్రెడ్డి మాటను నమ్మి రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్నారని డిసెంబర్ 9 నాడు మీరు(రేవంత్ రెడ్డి) ప్రకటించినట్టుగా రుణమాఫీ జరగలేదు" అని హరీశ్ రావు అన్నారు.
"రుణమాఫీ విషయంలో మీరు తక్షణం స్పందించాలని డిమాండ్ చేస్తున్నాను. రూ.2 లక్షల వరకు రుణమాఫీని ఎప్పట్లోగా చేస్తారో స్పష్టమైన తేదీ ప్రకటించాలని రైతుల పక్షాన కోరుతున్నాను. రైతుల రుణాలను ప్రభుత్వమే చెల్లిస్తుందని బ్యాంకర్లకు హామీ పత్రం రాసివ్వాలని విన్నవించుకుంటున్నాను. దేశానికి అన్నం పెట్టే రైతుకు భరోసా ఇవ్వడం ప్రభుత్వ కనీస బాధ్యత"- హరీశ్ రావు, బీఆర్ఎస్ నేత