Harish Rao on Medigadda Issue : కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు(Harish Rao) ధ్వజమెత్తారు. రేవంత్ సర్కార్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. తాము చేపట్టిన ప్రాజెక్టుల పర్యటనతో కాంగ్రెస్‌లో చలనం వచ్చిందన్న ఆయన, తమ పర్యటనతో కాంగ్రెస్ ప్రభుత్వం బెంబేలెత్తిందన్నారు. మేడిగడ్డకు మరమ్మతులు చేస్తామని మంత్రి ఉత్తమ్ చెప్పారని, ఎన్‌డీఎస్‌ఏ నివేదిక వచ్చిన నెలలోగా పనులు ప్రారంభిస్తామని చెప్పారని తెలిపారు. మంత్రి ప్రకటనతో తమ పర్యటనకు పాక్షిక విజయం చేకూరిందని వివరించారు.
BRS Leaders Visited Annaram Barrage : కాళేశ్వరంపై ప్రభుత్వం చేస్తున్న కుట్రలను బట్టబయలు చేసేందుకే చలో మేడిగడ్డ(Medigadda) పర్యటన చేపట్టినట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రాజెక్టు నిజస్వరూపం ప్రజలకు చెప్పేందుకే మేడిగడ్డకు వచ్చామన్నారు. ఈ క్రమంలోనే పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేయాలనేదే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. ప్రభుత్వం రైతుల పక్షాన పని చేయాలని, ప్రతిపక్షాలపై బురద చల్లకూడదని అన్నారు. గత ప్రభుత్వాన్ని తిట్టి లోక్‌సభ ఎన్నికల్లో 4 సీట్లు ఎక్కువ తెచ్చుకోవాలన్న ఆరాటమే కాంగ్రెస్‌లో కనిపిస్తోందన్న ఆయన, రాష్ట్ర, రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ లబ్ధికే పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు.
మెగా ప్రాజెక్టుల్లో సమస్యలు సాధారణం : గోబెల్స్ ప్రచారంతో దేశంలో కాలం వెళ్లదీస్తున్నది రేవంత్ ప్రభుత్వమేనని హరీశ్‌రావు దుయ్యబట్టారు. మెగా ప్రాజెక్టుల్లో సాంకేతిక సమస్యలు రావడం సాధారణమన్నారు. వచ్చే వర్షాకాలంలో రైతులకు సాగునీరు ఇవ్వడంపై దృష్టి పెట్టాలని సూచించారు. అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేస్తే నీళ్లు ఎలా ఇవ్వాలో తాము చెబుతామన్నారు. కాలయాపన చేసి రైతుల జీవితాలతో ఆడుకోవద్దని మనవి చేస్తున్నామని తెలిపారు. కాళేశ్వరాన్ని పడగొట్టి ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ను(BRS) పడగొట్టాలని కుటిల ప్రయత్నం చేస్తున్నారన్న ఆయన, కేసీఆర్‌కు పేరు వచ్చిందనే కాళేశ్వరం ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.