Harish Rao On Congress for Nurse Recruitment :స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించే కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమం ‘వంట అయ్యాక గరిటె తిప్పినట్లు’ ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ఉద్యోగ భర్తీ ప్రక్రియను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేస్తే, తమ ప్రభుత్వ ఘనతగా నియామక పత్రాల జారీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడి చేస్తుండటం దౌర్భాగ్యమని ఆక్షేపించారు.
2024 ఫిబ్రవరి ఒకటో తేదీన గ్రూప్-1 నోటిఫికేషన్(Group-1 Notification) ఇస్తామని పత్రికల్లో ప్రచారం చేసిన కాంగ్రెస్, దాని నుంచి విద్యార్థుల దృష్టి మరల్చేందుకే ముందు రోజు స్టాఫ్ నర్సులకు నియామకపత్రాల జారీకార్యక్రమాన్ని హంగు ఆర్భాటంతో నిర్వహిస్తోందని మండిపడ్డారు. చేయని పనులకు డబ్బా కొట్టుకోవడం బదులు, ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలుపై శ్రద్ధ చూపాలని హరీశ్‌రావు హితవు పలికారు.
స్టాఫ్ నర్సు నోటిఫికేషన్ కాంగ్రెస్ ఘనతగా హడావుడి :తెలంగాణ వైద్య, ఆరోగ్య రంగాన్ని దేశంలోనే మొదటి స్థానానికి చేర్చే లక్ష్యంలో భాగంగా పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల నిర్మాణంతో పాటు, జిల్లాకు ఒక వైద్య కళాశాలను తమ ప్రభుత్వం మంజూరు చేసిందని హరీశ్‌రావు వివరించారు. అందులో భాగంగానే వైద్య సిబ్బంది కొరత లేకుండా ఉండేందుకు మెడికల్, నర్సింగ్, పారామెడికల్, ఫార్మాసిస్టు, ఇతర సిబ్బంది నియామకాలకు కూడా శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.
ఎలక్షన్ కోడ్‌లోపు ఆరు గ్యారంటీలను అమలుచేయాలి : హరీశ్‌రావు
ఇందులో భాగంగా 7,094 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించి, తుదిఫలితాలు విడుదల చేసే సమయానికి ఎన్నికల కోడ్ మొదలైందని, దీంతో తుది ఫలితాల విడుదలకు తాత్కాలిక ఆటంకం కలిగిందని హరీశ్‌రావు గుర్తు చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహిస్తూ, నియామక పత్రాలు ఇచ్చే పేరిట హడావుడి చేస్తూ, స్టాఫ్ నర్సు నోటిఫికేషన్ తమ ప్రభుత్వ ఘనతగా ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు.