Harish Rao Comments On Party Defections : పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేవరకు తాము నిద్రపోమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడే వరకు సుప్రీంకోర్టులో పోరాడుతామని తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉపఎన్నిక వస్తుందని పేర్కొన్నారు.
'2001లో తెలంగాణ ఉద్యమం పిడికెడు మందితో ప్రారంభమైంది. కేసీఆర్ ఒక్కడే 14 ఏళ్ళు పోరాడి రాదని అనుకున్న తెలంగాణని తెచ్చి చూపించారు. ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా అలాంటి కుట్రలే చేశారని హరీశ్‌రావు ఆరోపించారు. మహిపాల్ రెడ్డికి మూడు సార్లు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని చేసిందని తెలిపారు. ఏం తక్కువ చేసిందని మహిపాల్ రెడ్డి పార్టీ మారారని ప్రశ్నించారు. ఆయనకి మనసు ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ మహిపాల్ రెడ్డిని తల్లిలా దగ్గర చేర్చుకుందన్నారు. గూడెం పోయినా కార్యకర్తలు గుండె ధైర్యం కోల్పోవద్దు' అని హరీశ్‌రావు సూచించారు.
పార్టీ ఫిరాయింపులు నివారించేందుకు బీఆర్‌ఎస్ అనర్హతా పిటిషన్ మంత్రం - Lok Sabha Election 2024
గతంలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టాలని అన్నారని, ఇప్పుడు ఆయనే కండువా కప్పుతున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో ఉండగా ఎలాంటి షరతులు లేకుండా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తానన్న రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక కోతలు పెడుతున్నారని మండిపడ్డారు. రేషన్ కార్డ్ ఆధారంగా రుణమాఫీ చేస్తామని జీవోలో ఉందని తెలిపారు. నోటితో మాత్రం రేషన్ కార్డుతో సంబంధం లేదని అంటున్నారని విమర్శించారు. నోటితో వచ్చిన మాటని జీవోలో పెట్టినప్పుడే తాము నమ్ముతామని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
పీఎం కిసాన్ నిబంధనలు ఎందుకు? రేషన్ కార్డు నిబంధనలు ఎందుకో చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. వడ్లకు బోనస్ అని గతంలో చెప్పి సన్నాలకి బోనస్ అని జీవో ఇచ్చారని మండిపడ్డారు. నూటికి 10 శాతం మాత్రమే సన్నాలు పండిస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తే ఐదేళ్లకు మించి అధికారంలో లేదని జోస్యం చెప్పారు. ఆరునూరైనా మళ్లీ అధికారంలో వచ్చేది బీఆర్ఏస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. కొద్ది రోజులైతే కాంగ్రెస్ వాళ్లు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో బస్సు తప్ప అన్ని తుస్సే అని ఎద్దేవా చేశారు.
'ఫిరాయింపులకు ఆద్యుడే కేసీఆర్ - అంకురార్పణ చేసిందే కాంగ్రెస్' - PARTY DEFECTIONS IN TELANGANA