Harish Rao about Staff Nurse Appointment Programme : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు చెప్పేది కొండంత, చేసేది గోరంత కూడా లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆక్షేపించారు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎల్బీ స్టేడియం వేదికగా స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మజీ మంత్రి హరీశ్ రావు స్టాఫ్ నర్సుల నియామకాల గురించి మాట్లాడారు. నియామక పత్రాల పేరిట ఆర్భాటం చేసి ఊహించినట్లు గానే తామే నియామకాలు చేసినట్లు డబ్బా కొట్టుకున్నారని ఆరోపించారు.
కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను వంచిందని ఎన్నికల ప్రచారంలో కల్లిబొల్లి మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన నర్సింగ్ ఆఫీసర్ల భర్తీ ప్రక్రియను తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ అబద్దాల ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. ప్రభుత్వం వచ్చిన 50 రోజుల్లోనే స్టాఫ్ నర్సు నోటిఫికేషన్ ఇచ్చి, నియామక పత్రాలు ఇచ్చారా అని హరీశ్ రావు ప్రశ్నించారు.
Harish Rao on Staff Nurse Recruitment : తమకు ఎలాంటి కుళ్లు, కడుపులో నొప్పి లేదన్న హరీశ్ రావు, సొమ్ము ఒకడిది సోకు ఇంకొకడిది అన్నట్లుగా ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడంలో రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరునే తప్పుబడుతున్నామని చెప్పారు. తెల్లారితే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తారనుకున్న నిరుద్యోగుల ఆశలపై రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నీళ్లు చల్లారని, అయన ప్రసంగంలో దీని గురించి ఒక్క మాటా కూడా మాట్లాడలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలే అని రేవంత్ రెడ్డి మరోసారి నిరూపించారని ఎద్దేవా చేశారు.