Gutha Sukender Reddy on BRS Failure : రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇవాళ కష్టాల్లో ఉందని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. పార్టీలో నిర్మాణం, అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సెంట్రిక్‌గా రాజకీయాలు చేయడం వల్లే ఇవాళ బీఆర్ఎస్ కష్టాల్లో పడిందని తెలిపారు. ఇతర పార్టీలకు వెళ్లిన ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారని, దానిపై న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఇవాళ నల్గొండ జిల్లా ఉరుమడ్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడారు. తాను పార్టీ మారుతున్న అనేది అవాస్తవమని, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నానని గుత్తా వివరించారు. అమిత్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వలేదనేది పూర్తిగా అవాస్తవమన్నారు. స్వయంగా కేసీఆర్ ఫోన్ చేసి అమిత్‌ను ఎంపీగా పోటీ చేయాలని కోరారని తెలిపారు. దీనిపై జిల్లాలోని నాయకులు కొంతమంది సహకరిస్తామన్నారని, మరి కొంతమంది తామే పార్టీ మారుతున్నామని చెప్పారని పేర్కొన్నారు.
సమీక్ష లేకపోవడం వల్లే :అందుకే పోటీ నుంచి అమిత్ తప్పుకున్నారని గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరు నెలలుగా కేసీఆర్‌ను కలవడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదన్నారు. పార్టీ నిర్మాణం, సమీక్ష లేకపోవడం వల్లే బీఆర్ఎస్కు ఈ పరిస్థితి వచ్చిందని, ఇప్పటికైనా బీఆర్ఎస్ నిర్మాణంపై నాయకత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు.