Former MP MVV Satyanarayana Son Kidnap Case Reopen: వైఎస్సార్సీపీ నేత, విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు అనేక భూదందాలు, ఆర్థిక నేరాలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. గతంలో జరిగిన ఆయన కుటుంబ సభ్యుల కిడ్నాప్ కేసు పునర్విచారణ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పట్లో పోలీసు ఈ కేసులో పూర్తి వివరాలు బయట పెట్టకుండా డబ్బు కోసమే కిడ్నాప్ జరిగిందంటూ తేల్చేశారు.
ఆ ఘటనపై ఎన్నో అనుమానాలున్నాయని, పునర్విచారణ చేయాలనే డిమాండ్ వచ్చినా పట్టించుకోలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ కేసు మిస్టరీపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పునర్విచారణకు న్యాయస్థాన అనుమతి కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఓ పోలీసు ఉన్నతాధికారి విశాఖ సెంట్రల్ జైలుకు వెళ్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన రౌడీషీటర్ హేమంత్‌తో గంటన్నరకు పైగా మాట్లాడడం చర్చనీయాంశమైంది.
మాజీ ఎంపీ ఎంవీవీకి ఎదురుదెబ్బ- మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు - High Court on YSRCP Ex MP MVV Case
హేమంత్‌కు గిఫ్ట్‌లు ఎందుకిచ్చారు?:ఎంవీవీతో పాటు ఆయనకు సన్నిహితుడైన స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ జి.వెంకటేశ్వరరావు (జీవీ)కు రౌడీషీటర్ హేమంత్‌తో ఉన్న సంబంధాలపై పోలీసు ఉన్నతాధికారి జైల్లో ఆరా తీశారు. 'ఎంవీవీ, జీవీ అనేక సెటిల్‌మెంట్లు చేయించారు. అందుకోసం నాకు ఇస్తానన్న డబ్బు ఇవ్వలేదు. పైగా కేసుల్లో ఇరికించి జైలుకు పంపారు. ఆ కోపంతోనే కిడ్నాప్ చేశా' అని హేమంత్ చెప్పినట్లు సమాచారం.
అదే నిజమైతే ఎంవీవీ, జీవీలకు ఉచ్చు బిగిసినట్లే. హేమంత్ గ్యాంగ్‌తో వారు సాగించిన భూదందాలు, లావాదేవీలు, ఆర్థిక నేరాలపై కూపీ లాగడమే తరువాయి. కొద్దిరోజుల క్రితం హేమంత్ కోర్టుకు హాజరైన సమయంలో స్నేహితుల ద్వారా సంతకం లేని ఓ లేఖను బయటకు పంపినట్లు సమాచారం. అందులో తనకు అందిన బహుమతుల గురించి వివరిస్తూ 'కొన్ని పంచాయితీలకు సంబంధించి విశాఖ చుట్టుపక్కల 12 చోట్ల విలువైన స్థలాలు, ఐదు విల్లాలు, ఖరీదైన మరో ఐదు కార్లు బహుమానంగా ఇచ్చారు. ఒక రౌడీషీటరుకు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయో విచారిస్తే అసలు విషయాలు బయట పడతాయి' అనేది ఆ లేఖ సారాంశం. ఈ నేపథ్యంలో ఎంవీవీ బంధువైన బెంగళూరుకు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి రౌడీషీటర్ హేమంత్‌కు గిప్ట్‌లు ఇవ్వడంపై సమగ్ర విచారణ జరపాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.
నాటి కిడ్నాప్‌నకు పంచాయితీలే కారణమా?:హేమంత్, అతడి స్నేహితులు కొందరు కలిసి గతేడాది జూన్‌లో ఎంవీవీ కుమారుడు శరత్‌ను ఆయన ఇంట్లోంచే కిడ్నాప్ చేశారు. తర్వాత కుమారుడు శరత్ ద్వారా తల్లి జ్యోతిని, జీవీని అక్కడకు పిలిపించి బంధించారు. రెండు రోజులపాటు చిత్రహింసలు పెట్టారు. దీంతో వారు అప్పటికప్పుడు రూ. 1.70 కోట్ల సొమ్ము సమకూర్చారు. వాటిలో రూ.40 లక్షల నగదు హేమంత్ సన్నిహితురాలికి పంపేందుకు ప్రయత్నించగా ఆమె తిరస్కరించినట్లు తెలిసింది. జీవీ హేమంత్ సన్నిహితురాలికి ఫోన్ చేసి 'రియల్ ఎస్టేట్‌లో హేమంత్‌కు ఇవ్వాల్సిన కమీషన్ డబ్బు ఇది తీసుకోండి' అని చెప్పినట్లు సమాచారం. మొత్తంగా నాటి కిడ్నాప్ కేసును పునర్విచారిస్తే జరిగిన అక్రమ లావాదేవీలు, సెటిల్‌మెంట్ల వివరాలన్నీ బయటకు వస్తాయని భావిస్తున్నారు.
TDP on MP family kidnap issue: వాటాలో తేడాతోనే.. కిడ్నాప్ కేసును సీబీఐకి అప్పగించాలి: టీడీపీ