Congress VS BRS Disputes in Siddipet :సిద్దిపేటలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ కార్యక్రమాలు కాస్త ఆందోళనకు గురిచేశాయి. రుణమాఫీపై ఎమ్మెల్యే హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంలో గులాబీ పార్టీ నేతలు సమావేశం నిర్వహించారు. మాఫీ కాని రైతులకు పార్టీ తరపున అండగా ఉండే అంశంపై చర్చించారు. మరోవైపు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని మైనంపల్లి హన్మంతరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించింది. పొన్నాలలో రాజీవ్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం పాతబస్టాండ్ వరకు బైక్ ర్యాలీ చేపట్టగా బ్లాక్ ఆఫీస్ వద్ద పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు నుంచే ర్యాలీకి కాంగ్రెస్ శ్రేణులు యత్నించగా ఉద్రిక్తతలు జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు సర్ది చెప్పి మరోమార్గంలో పంపించారు. రుణమాఫీపై సవాల్ చేసిన హరీశ్‌రావు రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తి అయిన క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో పెట్టకుండా కేసీఆర్ చిత్రం ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు.
'కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని నెరవేర్చినందుకు హరీశ్‌రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. మీరు రాజీనామాకు సిద్ధమా అని అడుగుతున్నా. ఉప ఎన్నికల్లో ఇద్దరం కలసి పోటీ చేద్దాం. మీరు గెలిస్తే ఎన్నికల్లో నేను మళ్లీ పోటీ చేయను. రాబోయే రోజుల్లో కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయం. బీఆర్ఎస్ నేతలను హరీశ్‌రావు రెచ్చగొట్టారు'- మైనంపల్లి హన్మంతరావు, మాజీ ఎమ్మెల్యే