Former MLA in cyber net : తిరుపతి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేకి ఈ నెల 5న ఓ మహిళ వాట్సాప్ కాల్ చేసింది. "మీ బ్యాంకు ఖాతా నుంచి కోట్ల రూపాయలు బదిలీ జరిగినట్లు గుర్తించాం.. సదరు వ్యక్తిని అరెస్టు చేసి బ్యాంకు ఖాతాలు పరిశీలిస్తే మీ పేరు బయటకు వచ్చింది" అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడింది. అప్పటికే ఆందోళకు గురైన సదరు మాజీ ఎమ్మెల్యే తాను ఎలా స్పందించాలో ఆలోచించేలోపే.. పైఅధికారితో మాట్లాడాలని మరో వ్యక్తికి ఫోన్ ఇచ్చింది. పైఅధికారినంటూ మాట్లాడిన మరో వ్యక్తి మాజీ ఎమ్మెల్యేపై బెదిరింపులకు పాల్పడ్డారు. తాను ఎవరికీ డబ్బులు పంపలేదంటూ చెప్పే ప్రయత్నం చేసినా మాట్లాడనివ్వకుండా పక్కా పథకం ప్రకారం ఊబిలోకి దించారు. పైగా తాము ఫోన్ చేసిన విషయం ఎవరికైనా చెప్తే వెంటనే అరెస్టు చేయిస్తామని హెచ్చరించడం గమనార్హం.
సైబర్ దాడుల నుంచి సురక్షితంగా ఉండాలా? ఈ టాప్-6 టిప్స్ మీ కోసమే! - How To Protect From Cyber Crime
వాస్తవాలు పరిశీలించాలని చెప్తూ తాము ఓ బ్యాంకు ఖాతా నంబర్ పంపిస్తామని, రూ.50లక్షలు బదిలీ చేయాలని చెప్పారు. తనిఖీల అనంతరం తిరిగి పంపిస్తామని చెప్పారు. దీంతో ఆందోళనకు గురైన మాజీ ఎమ్మెల్యే గత శనివారం వేర్వేరు బ్యాంకు ఖాతాల నుంచి రూ.50లక్షలు వారు చెప్పిన ఖాతాకు బదిలీ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఆయన కుమారుడు సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించి వెంటనే పోలీసులను సంప్రదించాలని అలర్ట్ చేశారు. చెప్పారు. మాజీ ఎమ్మెల్యే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.